జనసేనాని పవన్‌కళ్యాణ్ దూకుడు పెంచాడు. తన పార్టీలో పనిచేయాలని కోరుకునే వారి రిక్రూట్ మొదలుపెట్టాడు. ఇక ఆయన తెలుగు రాష్ట్రాలలోని ఎన్ని సమస్యలపై స్పందించినా కూడా ఆయన ఏకైక అజెండా మాత్రం ఏపీకి ప్రత్యేకహోదా. బిజెపికి వ్యతిరేకంగా పోరు మాత్రమే. నిన్నటివరకు ఆయన గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా కోసమే కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి మద్దతునిస్తున్నట్లు చెప్పాడు. కానీ టిడిపి మాత్రం ప్రత్యేకహోదాకు ఆశలు వదిలి, ప్రత్యేక ప్యాకేజీకి సై అంది. ఇక ఈ విషయంలో ఆయన బిజెపిని ఘాటుగా విమర్శిస్తున్నా టిడిపిని విమర్శించడంలో ఆచితూచి మాట్లాడుతున్నాడనే విమర్శలున్నాయి.
కానీ ఈమధ్య ఆయన టిడిపి ఎంపీల తీరును కూడా విమర్శించాడు. పనిలో పనిగా ప్రత్యేకహోదా కోసం గళం విప్పే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని తెలిపాడు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ గళమెత్తుతున్న తీరు, పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల ప్రవర్తన, విజయసాయిరెడ్డి ప్రసంగాలను ఆయన మరీ మరీ మెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు టిడిపితో పాటు వైసీపీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి భేషరత్తు మద్దతు పలకడం, జూన్‌లోనే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి, జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధికి ప్రత్యేకహోదా షరత్తులతో కూడిన మద్దతు కాకుండా భేషరత్తు మద్దతు ప్రకటించడంపై జనసేనాని ఇంకా నోరు విప్పలేదు. అదే జరిగితే ప్రత్యేకహోదా ఉద్యమాన్ని టిడిపి, వైసీపీల నుంచి పూర్తిగా పవన్ తన చేతుల్లోకి తీసుకున్నట్లే భావించాలి. అది ఆయనకు కలిసొచ్చే అంశం. పోరాట యోధునిగా పేరు తెచ్చుకుంటాడు.
సమైఖ్య రాష్ట్రం విషయంలో గెలిచినా ఓడినా లగడపాటి ఎలా హీరో అయ్యాడో.. ప్రత్యేకహోదా వచ్చినా రాకపోయినా జనసేనాని హీరో కావడం ఖాయం. మరోపక్క ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఏపీ మేధావులు, వామపక్షాలు కూడా మద్దతు తెలుపుతుండటంతో వారితో పవన్ నడవడం ఇక కాకతాళీయమే కావచ్చు. కాంగ్రెస్ హఠావో అని ఇప్పటికీ అంటాడో. లేక ప్రత్యేకహోదా కావాలని కోరుతున్న కాంగ్రెస్‌ను దరిచేర్చుకుంటాడో? మరి ఇకపై జనసేనాని తీసుకునే ప్రతి ఎత్తు వ్యూహాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది....!