ఒక్క 'బాహుబలి'తో బాలీవుడ్ ఖాన్స్‌తో పాటు ప్రపంచ దేశాల్లో యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ పాపులర్ అయ్యాడు. నేడు ఆయన నయా ఇంటర్నేషనల్‌స్టార్. ఇక ఆయన 'బాహుబలి' తర్వాత చేయబోయే చిత్రం కూడా అదే రేంజ్‌లో ఉండాలి. లేకపోతే ఒన్ మూవీ వండర్‌గా మిగిలిపోతాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా అంటే ఎలాగూ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌ల నుంచి బాలీవుడ్ వరకు సూపర్‌క్రేజ్ ఉంటుంది. బడ్జెట్ కూడా అదే లెవల్లో, ఇక క్యాస్టింగ్ కూడా అదే లెవల్లో ఉంటుందనేది బాగానే అర్ధమవుతోంది. దాంతో 'బాహుబలి' తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించే 'సాహో' చిత్రం కూడా మొదట అనుకున్న 50కోట్ల బడ్జెట్ నుంచి ఇప్పుడు ఏకంగా 150కోట్లకు పెరిగింది.
ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్‌లు అందిస్తుండగా, జాకీష్రాఫ్, వివేక్ ఒబేరాయ్‌లు కూడా ఇందులో నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఇందులో ప్రభాస్ సరసన స్టార్‌హీరోయిన్ కత్రినాకైఫ్ కూడా నటిస్తుందంటున్నారు. ఇక రెండో హీరోయిన్‌గా శ్రద్దాకపూర్, దిశాపటానీలను అడిగితే, ప్రభాస్ 'బాహుబలి' రేంజ్ కోసమైనా కోట్లకు కోట్లు బడ్జెట్ పెడుతాడని, ఇక కలెక్షన్లు కూడా సూపర్‌గా ఉంటాయని భావిస్తున్న వారు తాము తీసుకునే బాలీవుడ్ చిత్రాల పారితోషికానికి రెట్టింపు చెప్పారట. ఇక 'బాహుబలి'లో బాలీవుడ్‌కు పెద్దగా పరిచయంలేని అనుష్క, ఏదో ఒకటి అరా తెలిసిన తమన్నా నటించారు. కాబట్టి బడ్జెట్‌ను హీరోయిన్ల కోసం వేస్ట్ చేయకుండా కొత్త హీరోయిన్లతో నైనా సరే తక్కువ రేటుకు ఒప్పించి, ఖర్చుపెట్టే ప్రతిపైసా సినిమా స్క్రీన్‌పై కనిపించేలా భారీగా తీయడమే మేలనే వాదనలు వినిపిస్తున్నాయి.