జగన్ మోదీని కలవడం, వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి వ్యక్తికే భేషరత్తుగా మద్దతునిస్తామని చెప్పడం చూసి కొందరు టిడిపి తమ్ముళ్లు సంతోషంగా ఉంటే.. మరికొందరు మాత్రం మదనపడిపోతున్నారు. మోదీ హవా వచ్చే ఎన్నికల్లో కూడా ఉంటుందని, మరి బిజెపి వైసీపీతో జోడీ కడితే మోదీ ప్రభంజనం వైసీపీకి మేలు చేస్తుందని కొందరు సూత్రీకరిస్తున్నారు. కానీ దీనివల్ల జగన్‌కే నష్టమనే వాదన కూడా ఉంది.
ఇంతకాలం తమను ప్రత్యేకహోదా విషయంలో విమర్శించి, జూన్‌లోనే తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని, తద్వారా దేశం మొత్తం చూపు ఏపీ ప్రత్యేకహోదాపై పడేటట్లు చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని, ఇకపై ఆయన తమను ప్రత్యేకహోదా, కేంద్రం వద్ద ఓటుకునోటుకు తాకట్టు విషయాలు మాట్లాడలేడని, అలా మాట్లాడిన పక్షంలో తాము ఎదురుదాడికి దిగేలా జగనే తమకు అస్త్రం అందించాడని అంటున్నారు.
ఇక వైసీపీ బిజెపితో జత కట్టడం ద్వారా జగన్‌కు సపోర్ట్‌గా ఉన్న ముస్లిం మైనార్టీల ఓట్లు ఆయన కోల్పోతాడని, కిందటి ఎన్నికల్లో బిజెపితో పొత్తు వల్ల టిడిపికి దూరమైన ముస్లిం మైనార్టీలు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మరలా వైసీపీని వదిలి తమవైపే వస్తారని అంచనావేస్తున్నారు. ముఖ్యంగా జగన్‌కు రాయలసీమలో మంచి మద్దతు ఉందని, కర్నూల్, అనంతపురం జిల్లాలలో ముస్లిం ఓట్లు కీలకమని, వాటిని జగన్ కోల్పోవడం తధ్యమనే వాదన కూడా వినిపిస్తోంది.
కాబట్టి జగన్ అనుసరిస్తున్న రెండు నాల్కల ధోరణిని ప్రజల్లోకి తీసుకెళ్లి, వారికి వివరించేలా ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు తన నాయకులకు దిశానిర్దేశం చేశాడంటున్నారు. మరి బాబు.. జగన్ విషయంలో వ్యవహరించే దూకుడు ఎలా ఉండనుంది? అనేది త్వరలో తేలనుంది.