బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ చేసిన చిన్న తప్పుకు ఇప్పుడు అతను భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 'బాహుబలి-దికన్‌క్లూజన్'కి ముందు అమీర్‌ఖాన్ చిత్రాలైన 'పీకే. దంగల్'లు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఇక 'పీకే' చిత్రాన్ని అనూహ్యంగా చైనీయులు విశేషంగా ఆదరించారు. సాధారణంగా ఇతరదేశాల చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపే చైనీయులు 'బాహుబలి-1' కి కాకుండా 'పీకే'కు పట్టం కట్టారు.
ఆ తర్వాత నోట్ల రద్దు సమయంలో వచ్చిన 'దంగల్' చిత్రం కూడా ఇండియాలో మంచి కలెక్షన్లు సాధించింది. కానీ ఈ చిత్రాన్ని త్వరగా చైనీస్ బాషలోకి డబ్బింగ్ చేయకుండా అమీర్ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నాడు. తీరా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' ప్రభంజనం మొదలైన తర్వాత చైనాలో ప్రమోషన్‌ను స్వయంగా చేసి 'దంగల్'ను చైనీస్‌లోకి డబ్ చేసి ఏకంగా 9వేల స్క్రీన్లలో రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి చైనీస్ 10కి గాను అందరూ 9.5 కంటే ఎక్కువ రేటింగ్స్ ఇచ్చారు. చైనీస్ చిత్రాలను కూడా తోసిరాజని ఈ చిత్రం విడుదలైన మొదటి 10రోజుల్లోనే దాదాపు 400కోట్లు వసూలు చేసింది. మరో వందకోట్లు వసూలు చేయడం ఖాయమంటున్నారు.
ఆ లెక్కన 'దంగల్' కూడా 'బాహుబలి-ది కన్‌క్లూజన్'తో పాటు 1000కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. కానీ మొదట 1000కోట్లు సాధించిన చిత్రంగా మాత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రమే క్రెడిట్ కొట్టేసింది. అదే 'దంగల్'ను ఇంకా ముందుగా చైనీస్ భాషలో రిలీజ్ చేసి ఉంటే మొదటి 1000కోట్ల చిత్రంగా 'దంగల్' చరిత్ర సృష్టించి ఉండేది. మొత్తానికి ఇప్పటికీ ఇండియాలో 'బాహుబలి' హవా సాగుతుండగా, 'దంగల్' చైనాలో చరిత్రలను తిరగరాస్తోంది.