ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ విషయంలో విపక్షాలు, వామపక్షాలు చేసిన ఆందోళనను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి దుయ్యబట్టారు. ఆందోళన చేస్తే చస్తారని వామపక్షాలను బెదిరించాడు. వామపక్షాలకు తెలంగాణలో స్థానం లేదని, దానికి అసలు ఉనికే లేదని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఎవరో ఒకరి తోక పట్టుకొని పోవడానికి అవి ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ఆయన ఇతర విపక్షాలపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
టీజేఏసీ చైర్మన్ కోదంరాంపై విరుచుకుపడ్డాడు. ప్రతిపక్షాల అండ చూసుకుని కోదండరాం రెచ్చిపోతున్నాడని, ఆయనకు ఇప్పుడు జనసేన నాయకుడు కలిసి వచ్చాడని, అసలు జనసేన నాయకుడు ఎక్కడి నుంచి వచ్చిండు.. ఎందుకు వచ్చిండ్రో కూడా తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కేసీఆర్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని, ప్రతిపక్షాలకు ఏ సమస్య దొరక్కపోవడంతో ఇలాంటి చిన్న చిన్న విషయాలనే వారు పెద్దవి చేసి భూతద్దంలో చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డాడు. మొత్తానికి త్వరలో వామపక్షాలు, గద్దర్, కోదండరాంలతో పవన్ 'జనసేన' కలవడం ఖాయమని నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.