బాలకృష్ణ ఇప్పుడు పూరి డైరెక్షన్ లో ఒకచిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూరి సెప్టెంబర్ లో విడుదల చేస్తామని చెప్పి విరామం లేకుండా షూటింగ్ జరుపుతున్నాడు. మొదట్లో వీళ్ల కాంబినేషన్ పై రకరకాల వార్తలు ప్రచారమైనప్పటికీ ఇప్పుడు మాత్రం వీరి కాంబో మీద మంచి అంచనాలే వున్నాయి. ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని బాలకృష్ణ డాన్ గా నటిస్తున్నాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ అంటూ పెట్టలేదుగాని 'గ్యాంగ్ స్టర్' అనే టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక పూరితో ఈ చిత్రం కంప్లీట్ కాగానే బాలకృష్ణ.. కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఇక ఈ చిత్రం కూడా బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నాడని ఇదొక మాస్ మూవీ గా ఉండబోతుందని చెబుతున్నారు. అయితే బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేసిన చిత్రాలు 'నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి' చిత్రాలు చాలా పెద్ద హిట్స్. ఇప్పుడు కె ఎస్ రవికుమార్, బాలకృష్ణ తో చెయ్యబోయే కథ ముందుగా రజినీకాంత్ కోసం రాసుకున్నాడని... రజిని డేట్స్ ఖాళీ లేక బాలయ్య తో అదే కథతో మూవీని తెరకెక్కిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇకపోతే బాలకృష్ణ కి బాగా కలిసొచ్చిన రెడ్డి అనే టైటిల్ తోనే ఈ చిత్ర టైటిల్ వుండబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
కె ఎస్ రవికుమార్, బాలయ్య కాంబోలో తెరకెక్కే చిత్రానికి 'రెడ్డిగారు' అనే టైటిల్ బావుంటుందని...చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. ఇకపోతే 'రెడ్డిగారు' టైటిల్ నందమూరి ఫ్యాన్ కి ఒకే గాని పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఈ టైటిల్ విషయంలో పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.