నిన్నమొన్నటివరకు సమంత కి ఆఫర్స్ రావడం తగ్గాయని... కారణం అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెడుతున్న సమంతకు హీరోయిన్ గా ఆఫర్స్ ఇచ్చే ధైర్యం ఏ నిర్మాతలకు లేదనే ప్రచారం జరిగింది. నాగచైతన్య తో సమంత కు ఉన్న ప్రేమాయణం బయటపడ్డప్పటినుండి ఇదేరకమైన ప్రచారం జరిగింది. నిజంగానే 'జనతా గ్యారేజ్' తర్వాత సమంత మరే ఇతర టాలీవుడ్ సినిమాకి సైన్ చెయ్యకపోవడమే ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే తెలుగులో సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో సినిమాలు ఒప్పుకుంటూ సమంత అక్కడ బిజీ అయ్యింది.
ఇక నాగచైతన్యతో గత జనవరిలో ఎంగేజ్మెంట్ అయ్యాక సమంత ఒక్కసారిగా టాలీవుడ్ లో కూడా బిజీ అయ్యింది. నాగార్జున కీ రోల్ పోషిస్తున్న 'రాజుగారి గది 2' లో ఒక పాత్రకు ఎంపికైన సమంత వెంటనే సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రానికి సైన్ చేసింది. అంతేకాకుండా మహానటి సావిత్రి బయోపిక్ లోను ఒక ముఖ్య పాత్రకి ఎంపికైంది. మరి ఒకేసారి మూడు సినిమాలతో టాలీవుడ్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ అయిన సామ్ అటు తమిళంలో ఒప్పుకున్న చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.
ఇక్కడ టాలీవుడ్ చిత్రాల్లో బిజీగా వున్న సమంత ఇప్పుడు వచ్చే నెల నుండి తమిళంలో విజయ్ కి జోడిగా అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రానికి షిఫ్ట్ అవుతుందట. ఈ చిత్రంలో విజయ్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ ఒక్కో పాత్రకి ఒక్కో హీరోయిన్ ని ఎంపిక చేశారు. నిత్యామీనన్, కాజల్, సమంతలు హీరోయిన్స్ గా తీసుకున్న చిత్ర యూనిట్ ఇప్పటికే నిత్యామీనన్ తో ఉన్న సీన్స్ ని షూట్ చేశారని.... ఇప్పుడు కాజల్ కు సంబందించిన సీన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. ఇక మిగిలింది సమంత ఆ సినిమా షూటింగ్ లో జాయిన్ కావడమే. మరి ఇన్ని సినిమాలతో అంత బిజీగా వున్న సమంత, నాగచైతన్యతో పెళ్లికి ఎప్పుడు ఫ్రీ అవుతుందో అని తెగ ఎదురు చూస్తున్నారు.