మేమేమి చేశాము నేరం.. మమ్మల్నెందుకు పీడిస్తున్నావు మోదీజీ... అనేది ప్రతి చోటా, ప్రతి సామాన్యుని నోటి నుంచి వినిపిస్తోంది. 500. 1000నోట్లు రద్దు చేసి, కొత్తనోట్లను ప్రవేశ పెట్టినప్పుడు తమకు ఎన్నో..ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురైనా ప్రజలు ఓపికతో సహించారు. మన మంచి కోసమే కదా..! మోదీ ఈ నిర్ణయం తీసుకుందని గర్వపడ్డారు. కానీ దాని వల్ల కలిగిన ప్రయోజనాలను, ఎంత నల్లడబ్బు బ్యాంకులకు వచ్చింది? దేశ ఆర్ధిక వ్యవస్థను అది ఎలా కాపాడింది? అనే విషయంపై ఇప్పటికీ బిజెపి నాయకులు నోరు విప్పడం లేదు.
మరోవైపు గాలి జనార్దన్‌రెడ్డి నుంచి శేఖర్‌రెడ్డి వరకు ఎందరో కుబేరులు తమదైన పంథాలో నోట్లను మార్చేసుకుంటున్నారు. తాజాగా ఓ వేలకోట్ల హవాలా స్కాం బయటపడింది. ఇది ఓ యువకుడు చేసిన పని, ఓ యువకుడే తన తెలివితో అంత పని చేసినప్పుడు ఇక ఆర్ధిక నేరాలలో ఆరితేరిన వారు, ప్రముఖ చార్టెడ్ అకౌంట్ల సాయం ఉండే బడా బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయనాయకులు, బడా వ్యాపారులు ఎలా దీనిని సొమ్ము చేసుకున్నారో అర్ధమవుతోంది.
కోట్లకు కోట్లు బ్యాంకులకు ఎగగొట్టిన వారిని, విదేశాలలో తలదాచుకున్న లలిత్ మోడీ వంటి వారిని ఏమి చేయలేకపోతున్నావు. సామాన్యులకు మాత్రం ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు పెడుతున్నావు. ప్రభుత్వ బ్యాంకుల ఏటీఎంలలో డబ్బు లేదు. ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, యాక్సిస్ వంటి బ్యాంకుల్లో నిత్యం డబ్బు ఉంటోంది. పోనీ ఆ బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకుందామంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు.
పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తావనుకుంటే వీర జవాన్ల భార్యలు, సంతానం నీకు గాజులు, బ్లౌజ్‌లు పంపుతున్నారు. ఇంధన పొదుపులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పెట్రోల్‌బంక్‌లు ఉంటాయని, ఆదివారాలు సెలవంటున్నావు. అదేమంటే ఇందన పొదుపు అంటున్నారు. కోట్లు ఖరీదు చేసే కార్లలో తిరిగే వారికి, చిన్న చిన్న వ్యాపారులు, సామాన్యులు, మధ్యతరగతి వారు వాడే వాహనాలకు ఒకే ధరకు పెట్రోల్, డీజిల్ ఇవ్వడం ఎందుకు? దానికి కూడా రేషన్ విధానాన్ని పాటించి, ఇన్ని లీటర్ల కంటే ఎక్కువ వాడిన వారికి రేటు పెంచి, సామాన్యులకు తక్కువ ధరకే ఇవ్వవచ్చు కదా..! అసలు 2000నోట్లను ఎందుకు పెట్టావు? బ్లాక్‌మనీ ఉన్నవారు వాటిని వైట్ చేసుకునేందుకేనా?