అక్కినేని ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టనున్న సమంత సినిమాలలో ఇప్పటికీ బిజీగానే ఉంది. మరో పక్క నాగచైతన్య కూడా వరస చిత్రాలు చేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో సమంత రామ్ చరణ్ - సుకుమర్‌ల చిత్రంలో, మహానటి సావిత్రి బయోపిక్ 'మహానటి'లో జర్నలిస్ట్ పాత్రలను చేస్తోంది. ఇక నుంచి గ్లామర్‌రోల్స్ కాకుండా మంచి నటనకు అవకాశం ఉన్న చిత్రాలలో నటించాలని, పెళ్లయిన తర్వాత కూడా ఇలాంటి చిత్రాలలో నటిస్తూనే ఉండాలని ఆమె ఆశించింది.
కాగా ఇటీవల కన్నడలో పవన్‌కుమార్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన 'యూటర్న్' చిత్రం సంచలన విజయం సాధించింది. కాగా ఈ చిత్రం కన్నడ నాట భారీ విజయం సాధించడంతో పాటు కొత్తదనం ఉన్న స్టోరీ కావడంతో ఆ చిత్రం సమంత, నాగచతన్యలకు బాగా నచ్చింది. దీంతో వీరిద్దరు బెంగుళూరు వెళ్లి ఈ చిత్ర నిర్మాతలతో పాటు దర్శకుడు పవన్ కుమార్‌ని కూడా ఒప్పించారని, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సమంత లీడ్‌రోల్‌లో కన్నడ ఒరిజినల్ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వంలోనే తీస్తారని, ఈ చిత్రాన్ని సైతం సమంత, నాగచైతన్యలే నిర్మిస్తారని ప్రచారం జరిగింది.
కానీ ఈ చిత్రం కథ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో అనే అనుమానంతో సమంత, చైతూలు ఈ చిత్రం నుంచి డ్రాపయినట్లు సమాచారం. ఈ చిత్రం రీమేక్ హక్కులను మరో నిర్మాత చేజిక్కించుకుని, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో నిత్యామీనన్ లీడ్‌రోల్‌గా తీయాలని డిసైడ్ అయ్యారట.