వర్మ రోజు రోజుకీ పేట్రేగిపోతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని, అమితాబ్ దయతో పట్టాలెక్కించిన 'సర్కార్3' కూడా నిరాశపరచడంతో ఆయన మరో సారి తన చేతికి, నోటికి పనిచెప్పాడు. గతంలో కూడా ఆయన ఎక్కడ వివాదాస్పద అంశముంటే అక్కడ వాలిపోయేవాడు. 'రెడ్డిగారు పోయారు' తీస్తానన్నాడు. 'శ్రీదేవి ఉరఫ్ సావిత్రి' ఏమైందో తెలియదు. దేశంలోనే భారీ బడ్జెట్‌తో 'న్యూక్లియర్' మొదలుపెడతానని బాంబు పేల్చాడు.
'రక్తచరిత్ర, వంగవీటి, 26/11 ఎటాక్స్, వీరప్పన్'లతో పాటు వచ్చే ఎన్నికల నాటికి 'శశికళ' మీద చిత్రం చేస్తానన్నాడు. ఇక గ్యాంగ్‌స్టర్ నయిం మీద జీవిత చరిత్ర తీస్తానని చెప్పాడు. ఇప్పుడు తాజాగా గాంధీని చంపిన 'గాడ్సే' మీద చిత్రం తీస్తానని, గాంధీ మహాత్ముడిని చంపేటప్పుడు గాడ్సే మనసులో ఏముంది? ఆయన ఆలోచనా విధానం ఎలా ఉంది? అని పరిశోధించి ఓ సంచలన చిత్రం తీస్తానని తాజాగా సెలవిచ్చాడు.
మొత్తానికి నాథూరాం గాడ్సేని అసలు వర్మ తీస్తాడా? లేక కావాలనే తన పేరు ఏదో విధంగా వార్తల్లో ఉండాలని ఇలా అన్నాడా? 'సర్కార్3' ఫ్రస్టేషన్‌లో ఈ మాటలు మాట్లాడాడా? అన్నవి వర్మని సృష్టించిన బ్రహ్మకైనా తెలుసో లేదో గానీ మనకు మాత్రం అవి అర్ధం కాని విషయాలనే చెప్పాలి..!