ఒకవైపు మిత్రపక్షమైన బిజెపితో టిడిపి విరోధాలు.. మోదీని జగన్ కలవడం వంటి విషయాలతో ఏపీ రాజకీయం రంజుగా మారింది. జగన్ ఇంకా ముద్దాయేనని, ఆయన దోషి కాదని, ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత ప్రధానిని కలిస్తే తప్పేముందని బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి టిడిపిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజుతో సహా పలువురు స్థానిక బిజెపి నాయకులు ఇదే అంశం ప్రస్తావిస్తున్నారు.
మరోపక్క జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడి మోదీని ప్రత్యేకహోదా విషయంలో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాడని అంటున్నాడు. మరి ఆయన సీఎం అయితే ఎలా ఏపీకి ప్రత్యేకహోదా తేగలడో తెలియడం లేదు. దానిపై ఆయనకే క్లారిటీలేదు. ప్రత్యేకహోదా ఇక రాదని ఆయనకు తెలిసినా ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ను ఇంకా ఇంకా రగులుస్తూనే ఉన్నాడు. ప్రత్యేకహోదా కోసం త్వరలో తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని, ఏపీ ప్రజల ప్రత్యేకహోదా సెంటిమెంట్ ఎంతుందో చూపుతానన్నాడు.
కానీ మోదీ దగ్గరకు వెళ్లి రాష్ట్రపతి పోటీలో బిజెపి చెప్పిన వ్యక్తికి బేషరత్తుగా సమర్థిస్తామంటున్నాడు, నిన్నటి దాకా ప్రత్యేకహోదా కోసం ఎన్డీఏ నుంచి టిడిపి వైదొలగాలని కోరిన జగన్ ఇప్పుడు ఎన్డీయేలో చేరడానికి ఉబలాటపడుతున్నాడు. మరోవైపు తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి అనే రీతిలో బిజెపి అధిష్టానం వ్యవహరిస్తోంది. మరి వీటిని ఏమని విశ్లేషించాలి? దోషులు ఎవరు? అందరూ దొంగలే కదా అనిపించకమానదు. రాజకీయాలపై జుగుప్స కలగడం ఖాయంగా కనిపిస్తోంది.