దేశంలో మోదీ హవా.. రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు జరుగుతున్న తతంగం, ఏపీలో కాంగ్రెస్‌కు ఇప్పటికిప్పుడు పరిస్థితులు అనుకూలించే సంకేతాలు కనిపించకపోవడం వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా వచ్చే ఎన్నికల నాటికి తమ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) కలిసి పోటీ చేస్తాయనే ఆలోచనలో ఉన్నాయి. కానీ జగన్ మోదీని కలిసి యూటర్న్ తీసుకోవడంతో కాంగ్రెస్ వైసీపీపై ఆశలు వదులుకుంది.
దీంతో పాపం..రఘువీరారెడ్డి అన్యాపదేశంగా తన వైరాగ్యాన్ని చాటుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండాలని ఉర్రూతలూగుతుండటం, యూపీఏ మద్దతు దారుల సంఖ్య తగ్గిపోతుండటం కూడా కాంగ్రెస్ పతానాన్ని సూచిస్తోంది. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, ప్రస్తుతం జిల్లా డిసీసీ అధ్యక్షునిగా ఉన్న పనబాక కృష్ణయ్యలు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. దీనిపై మంతనాలు కూడా మొదలయ్యాయి.
మరోపక్క మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వైసీపీ వైపు చూస్తున్నాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వాడు కావడం వైసీపీకి కలిసొచ్చే అంశం. ఇక ఇప్పటికే దగ్గుబాటి, కావూరి, కన్నా... వంటి నాయకులు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. సో.. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు అసెంబ్లీలో బోణీ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. చిరు వంటి వారు కూడా మౌనంగా ఉండటం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.