ప్రతి హీరో అభిమానులుండాలని కోరుకుంటాడు. తనకంటూ ఓ ఇమేజ్ రావాలనుకుంటాడు. కానీ ఇమేజ్ వచ్చే కొద్ది దాని చట్రంలో ఇరుక్కుంటాడు. అభిమానులు పెరిగే కొద్ది వారు చేసే తప్పులకు కూడా హీరోలే కారణభూతులవుతారు. ఇక పవన్ ఫ్యాన్స్ సందర్భం ఏదైనా, వేదిక ఏదైనాసరే పవన్..పవన్ అని అరవడం.. చాలా మందికి, నిజానికి ఆయన సోదరులకు కూడా ఆగ్రహం తెప్పించింది. ఇక ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి.
ఇక హీరోలు ఎంతో స్నేహపూరితంగా ఉన్నా కూడా అభిమానులు మాత్రం రెచ్చిపోతున్నారు. హీరోలు ఇతర కులాల వారిని పెళ్లిళ్లు చేసుకుంటూన్నా... ఆ హీరో మన కులం వాడే అని వాదించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ఊపందుకున్న తర్వాత కుక్కలు, పందులు, ఇతరుల ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ వ్యతిరేక హీరోలపై కసి తీర్చుకుంటున్నారు. ఇక మహేంద్రసింగ్ ధోని నుంచి చెప్పులపై ఫొటోలు వేసే కంపెనీల వరకు ఇదే దోరణి.
తాజాగా తమిళ స్టార్ విజయ్ అభిమాని తమ హీరోని శివుడి గెటప్‌లో చూపిస్తూ త్రిశూలం పట్టుకుని రుద్రతాండవం ఆడుతున్నట్లు ఫొటో క్రియేట్ చేశాడు. కానీ త్రిశూలం పట్టుకుని నృత్యం చేస్తున్న విజయ్ కాళ్లకి షూలున్నాయి. ఇంకేముంది.. కొన్ని హిందు సంస్థల ఆత్మాభిమానం దెబ్బతింది. పోలీస్‌ల వరకు ఈ కేసు వెళ్లింది. రేపో మాపో ఆ అభిమాని చేసిన పనికి ఆ హీరో క్షమాపణ చెప్పించుకోవాల్సి వచ్చేట్లు కనిపిస్తోంది.