ఒకవైపు రాజకీయాల అప్‌డేట్స్.. ట్వీట్స్.. మరో వైపు జనసైనికుల నియామకం.. వారితో కలిసి మీటింగ్‌లు.. మరోవైపు సినిమాలు.. కొత్తకథలు వింటూ పవన్ చాలా బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ రాధాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఆగష్టు11న విడుదల చేసేందుకు జెట్‌స్పీడ్‌తో షూటింగ్ జరుపుతున్నారు.
ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ఓ సెట్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. పవన్ చిత్రాల యాక్షన్ సీన్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకదెబ్బకు డజను మంది విలన్లు ఎగిరిపడిపోయే సీన్లు గతంలో ఆయన చేసినప్పటికీ నాచురల్, సమ్‌థింగ్ స్పెషల్ ఫైట్స్‌కే ఆయన మొగ్గు చూపుతాడు. గతంలో తాను నటించిన కొన్ని చిత్రాలకే గాక తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన'డాడీ' చిత్రంలోని ఫైట్స్‌ను కూడా ఆయన కంపోజ్ చేశాడు.
ఫైట్‌మాస్టర్స్ ఎవరైనా సరే ఆయన తనకు నచ్చిన సలహాలిస్తుంటారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ రావడంతో పాటు పలు చిత్రాల యాక్షన్ సీన్స్ కోసం ఆయన ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటాడు.కాగా ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్‌తో చేస్తున్న చిత్రంలో ఐదుఫైట్స్ ఉంటాయట. ఇవ్వన్నీ ఎంతో నేచురల్‌గా, ఒకదానికొకటి విభిన్నంగా ఉంటయని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం విజయన్, పీటర్ హెయిన్స్, రవి వర్మలతో పాటు పవన్, మరో హాలీవుడ్‌స్టంట్ మాస్టర్ కూడా పనిచేస్తున్నాడట.
ప్రస్తుతం ఓ కీలక యాక్షన్ సన్నివేశం కోసం పవన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. మొత్తానికి ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా పక్కా మాస్ చిత్రంగా కూడా రూపొందుతోందని సమాచారం.