దక్షిణాదిలో అందునా తమిళనాడు సినీ ప్రేక్షకుల పిచ్చి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. వారు సినిమాని సినిమాలా చూడరు. తమ స్వంత తల్లిదండ్రులు, తమ ప్రాణం కంటే ఎక్కువగా వారి అభిమాన నటీనటులను ప్రేమిస్తూ, ఆరాధిస్తుంటారు. గతంలో తమిళనాడులో ఖుష్బూ, నమితా వంటి వారికి వారు గుళ్లు సైతం కట్టారు. మొత్తానికి ఈ వ్యవహారం చివరకు టాలీవుడ్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది.
ఏదో 'శ్రీశ్రీ'కి లేదా మరో మహానుభాహుడుకి గుడి కట్టినట్లుగా, విగ్రహం పెట్టినట్లుగా ఇటీవల తెలంగాణలోని ఓ ప్రాంతంలో అభిమానులు దర్శకుడు పూరీజగన్నాథ్‌కు విగ్రహం పెట్టడం ఆశ్చర్యం వేసింది. ఇక తాజాగా కోల్‌కత్తాలోని బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అభిమానులు తమ బిగ్‌బికి ఫైబర్‌తో చేసిన విగ్రహాన్ని తయారు చేయించి, ప్రతిష్ట చేశారు. అమితాబ్ పుట్టిన రోజున అంటే అక్టోబర్11న ఈ విగ్రహాన్ని అమితాబ్ చేత ఆవిష్కరింపజేస్తామని ప్రకటించారు.
వీరు చేస్తున్న పిచ్చి పరాకాష్టకు చేరుతుంటే.. నటుడు,కొరియోగ్రాఫర్, దర్శకుడు, ప్రముఖ సంఘసేవకుడు రాఘవ లారెన్స్ తన తల్లి బతికుండగానే ఆమె తనకు చేసిన, తనను కష్టపడి పెంచిన దానికి గుర్తుగా తాను గతంలో నిర్మించిన రాఘవేంద్రస్వామి గుడి ఎదురుగా 13 అడుగుల గాయత్రి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆమె పాదాల వద్ద తన తల్లి విగ్రహాన్ని నెలకొల్పాడు. మాతృదినోత్సవం సందర్భంగా తనను ఎన్నో విషయాలలో ఆదుకున్న సూపర్ సుబ్బరాయన్ చేతుల మీదుగా ఈ గుడిని తెరిచి, 1000 మంది మాతృమూర్తులకు చీరలు, రవికెలతో పాటు ఆరుగురు మహిళారైతులకు భారీ మొత్తాన్ని అందించాడు. అది నిజమైన భక్తి, గౌరవం అంటే...ముందు తల్లిదండ్రుల తర్వాతే హీరోలైనా.. జీరోలైనా...!