ఒకప్పుడు ఓ హీరో సినిమా స్టార్ట్ అయిందంటే ఏదో ఒక ప్రెస్ మీట్‌లోనో లేక ప్రారంభోత్సవం రోజునో సినిమా మూలకథాంశం ఏమిటి? ఎలా ఉండ నుంది? అనే విషయాలను దర్శకనిర్మాతలు, హీరోలు చూచాయగా చెప్పేవారు. ఇక రీమేక్‌లంటే కథ ఎలా ఉంటుందో ఈజీగానే అర్దమవుతుంది. ఇక ఇలా ముందుగానే స్టోరీ మెయిన్ పాయింట్‌ను, హీరో క్యారెక్టర్‌ను చెప్పడం వల్ల సినిమాల షూటింగ్ సమయంలోనే హైప్ రావడం, చివరకు ఆ స్థాయిలో చిత్రం లేదని నిరుత్సాహపడటం అనేవి నష్టాలను తీసుకొచ్చేవి.
కానీ ఇప్పుడు మాత్రం మన స్టార్స్ నుంచి చిన్నహీరోల వరకు సస్పెన్స్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నారు. టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్‌లుక్స్‌లో కూడా తమదైన పంధాలో సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఉదాహరణకు బాలయ్య-పూరీ చిత్రంలో బాలయ్య గ్యాంగస్టర్‌గా నటిస్తున్నాడనే వార్తలు తప్ప అది నిజమో కాదో తెలియదు. ఇంకా టైటిల్ కూడా పెట్టలేదు. మహేష్ 'స్పైడర్' టైటిల్ ద్వారా ఇందులో మహేష్ ఓ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తున్నాడన్న ఒక్క విషయం మాత్రమే రివీల్ అయింది.
ఇక చరణ్-సుకుమార్ చిత్రం, ఎన్టీఆర్-బాబిల జై లవ కుశ, పవన్-త్రివిక్రమ్ చిత్రం, బన్నీ నటిస్తున్న 'డిజె' చిత్రాల షూటింగ్‌లే కాదు.. వాటిలోని క్యారెక్టర్లు, సినిమా ఏ జోనర్‌లో ఉండనున్నాయో పుకార్లే తప్ప కనీసం ఊహించలేని పరిస్థితిలో ప్రేక్షకులను ఉంచుతున్నారు. ఇక రవితేజ 'రాజా దిగ్రేట్', రాజ్‌తరుణ్ 'అంధగాడు' వరకు అందరూ అదే బాటలో నడుస్తుండటం విశేషం.