టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పైడర్'. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ఆయన కోలీవుడ్‌లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇక దీనిని బాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. కాగా దేశంలోని అన్నివుడ్‌లలో పేరున్న మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా,హారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.
వాస్తవానికి ఈ చిత్రాన్ని సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత జూన్23 అనుకున్నారు. ఆ తర్వాత ఆగష్టు11 అని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. 'బాహుబలి' దెబ్బతో ఇండియన్ సినిమా స్థితి మారిపోయింది. తీస్తే మంచిఎమోషన్స్, కథాబలం ఉండే చిత్రాలు, లేకపోతే భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్న చిత్రాలు అనేే రెండు మార్గాలు ఏర్పడ్డాయి.
మొదట్లో మహేష్ 'స్పైడర్'కి సైతం విఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ వంటి వాటిని జోడించాలని భావించినప్పటికీ 'బాహుబలి' తర్వాత మామూలు హంగులు చాలవని, సాధారణ గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లతో వస్తే పేలవంగా ప్రేక్షకులు భావించే అవకాశం ఉందని మురుగదాస్ భావిస్తున్నాడట. దాంతో తాజాగా ఈ చిత్రం టెక్నికల్ అంశాల కోసం మకుట గ్రాఫిక్స్, కణ్ణల్‌కన్నన్‌కి అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. అయితే హడావుడి పెడితే వీలుకాదని, దానివల్ల తమ సంస్థకు చెడ్డపేరు వస్తుందని భావించిన ఆ సంస్థ మురుగదాస్‌ను మరింత సమయం కోరిందనే వార్తలు వినిపిస్తున్నాయి.