పెద్ద వంశీకి కె.విశ్వనాథ్ తర్వాత సంగీతంలో అంత అద్బుతమైన అభిరుచి ఉంది. ఆయన సామాన్యంగా ఎవ్వరి సంగీతాన్ని ఓకే చేయడు. తనకు కావాల్సిన అవుట్‌పుట్ ఇచ్చేదాకా వదలడు. ఒకప్పుడు ఆయనకు దిగ్రేట్ ఇళయరాజా ఆస్థాన సంగీత దర్శకుడు. ఆ తర్వాత దివంగత చక్రితో కలిసి ప్రయాణించాడు. ప్రస్తుతం ఆయన చాలా గ్యాప్ తర్వాత అలనాటి తన క్లాసిక్ 'లేడీస్‌టైలర్'కి సీక్వెల్‌గా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటల ట్యూన్స్, విజువల్స్, ట్రైలర్ అదిరిపోతోంది. ఈ చిత్రం వంశీ ప్రారంభిస్తున్నాడని తెలిసినప్పుడు చాలా మంది వంశీ.. ఎవరిని సంగీత దర్శకునిగా పెట్టుకుంటారో అని ఆసక్తి కనపరిచారు. చివరకు ఆయన మెలోడీ బ్రహ్మ మణిశర్మని ఎంచుకున్నాడు.
ఇక తాజాగా ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మణిశర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఓ షాకింగ్ నిజం ఓపెన్‌గా చెప్పేశాడు. వాస్తవానికి మణిశర్మ ట్యూన్స్ ఇవ్వడంలోనే కాదు.. దానికి తగ్గ సాహిత్యాన్ని రాయించుకోవడంలో, రీరికార్డింగ్ ఇవ్వడంలో ఎవర్‌గ్రీన్. ఆయన ఊపులో ఉన్నప్పుడు చిరంజీవి, బాలయ్యల నుంచి మహేష్ వరకు అందరూ ఆయనే కావాలని కోరుకున్న మాట వాస్తవం. ప్రస్తుతం వారందరూ ఆయన్ను మర్చిపోయారు.
ఇక తాజాగా మణిశర్మ మాట్లాడుతూ, నేను ఎప్పుడు స్వేచ్చగా సంగీతాన్ని అందించాలని భావిస్తాను. చిరంజీవి నటించిన 'చూడాలని వుంది..' చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ కాగా సంగీతం మణిశర్మ అందించాడు. ఈ చిత్రం కోసం ఆయన ఎంతో కేర్ తీసుకుని రూపొందించిన 'రామ్మా.. చిలకమ్మా...' పాట చిరుసాంగ్స్ టాప్10లో చోటు దక్కించుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ పాట చిన్నారుల నుంచి వృద్దుల వరకు ఆబాలగోపాలన్ని ఠక్కున క్యాచ్ చేసేలా రూపొంది అలనాడు అందరి నోటిలో వినిపించింది. కానీ మొదట ఈ ట్యూన్‌కు చిరు నో చెప్పాడట. తనస్టైల్‌కు ఈ ట్యూన్ సెట్ కాదని భావించాడట. దాంతో మణి ఇంకో ట్యూన్‌ని రెడీ చేసినా యూనిట్, గ్రూప్ డ్యాన్సర్లు అందరూ 'రామ్మా ..చిలకమ్మ'కే ఓటు వేయడంతోనే చిరు ఒప్పుకున్నాడని అయన చెప్పుకొచ్చారు.
పెద్ద డైరెక్టర్ల, స్టార్ హీరోల అభిరుచి వల్ల సంగీతంలో స్వేచ్చ లేకుండా పోతోందని, ప్రస్తుతం తాను చేస్తున్న 'ఫ్యాషన్ డిజైనర్'తో పాటు 'అమీతుమీ' , శమంతకమణి, నితిన్-హనురాఘవపూడిల 'లై' చిత్రాలలోని పాటలు విని సాహిత్యం, సంగీతం బాగా లేదంటే తాను ఇక సంగీతం చేయనని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద బతకడం లేదని కుండబద్దలు కొట్టాడు.