గతేడాది చిన్న చిత్రంగా ఏ మాత్రం హీరో లక్షణాలు లేని, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో 'పిచ్చైకారన్' వచ్చి పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులోకి డబ్ అయి 'బిచ్చగాడు'గా కోట్లు కొల్లగొట్టింది. మహేష్ వంటి వారికి కూడా చుక్కలు చూపించింది. మదర్ సెంటిమెంట్‌కు బిచ్చగాళ్ల నేపథ్యం కలిపి, మిలియనీర్‌తో బిచ్చగాడి వేషం వేయించిన ఈ చిత్రం తెలుగులో ఓ పెద్ద సంచలనం.
ఈ చిత్రంతో హీరో విజయ్ ఆంటొని చిత్రాలకు తెలుగులో పెద్దగిరాకీ ఏర్పడింది. కానీ ఈ చిత్రం దర్శకుడిని మాత్రం మన వారు పట్టించుకోలేదు. ఈ చిత్ర దర్శకుడు శశి ఏమీ కొత్తవాడుకాదు. గతంలో తమిళంలో హిట్టయిన తన చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌తో 'శ్రీను' చిత్రం చేసి ప్లాప్ మూటగట్టుకున్నాడు.దాంతో చాలాకాలం అజ్ఞాతవాసం చేసి 'బిచ్చగాడు'గా వచ్చి సంచలనం సృష్టించాడు.
కాగా ఈయనతో చిత్రాలు చేయాలని ఇప్పటికే పలువురు తమిళ హీరోలు క్యూలో ఉన్నారు. కానీ 'బిచ్చగాడు'ని తెలుగులోకి అనువాదం చేసిన చదలవాడ బ్రదర్స్ ఈ దర్శకుని కాల్షీట్స్ సొంతం చేసుకున్నారట. త్వరలో శశి దర్శకత్వంలో ఓ స్ట్రెయిట్ తెలుగు చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఓ మోస్తరు గుర్తింపు ఉన్న ఓ యంగ్ హీరోతో రెండు భాషల్లోనూ ఏకకాలంలో చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి శశి మరో సారి తెలుగు ప్రేక్షకులకు తన సత్తా ఏమిటో నేరుగా చూపించనున్నాడు.