స్టార్ హీరోలు కేవలం హిట్ దర్శకుల చుట్టూనే తిరగాలని, వారితోనే చిత్రాలు తీయాలని లేదు. అది తప్పు కూడా. అలా ఎన్నో పొర పాట్లు చేసిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇప్పుడు తన పంథా మార్చాడు. కానీ అదే సమయంలో సినిమా రంగంలోకి యువ రక్తం వస్తోంది. నేటి ట్రెండ్‌కు, నేటి తరానికి, ప్రేక్షకులకు మెచ్చేలా చిత్రాలు తీస్తున్నారు. తమ సత్తా చాటుతున్నారు. కేవలం రెండు మూడు షార్ట్ ఫిలింస్ తీసినవారు సరికొత్త ఐడియాలతో వస్తున్నారు.
గతంలో వీరందరూ సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను తెరపై చూసి ఆరాధించి, వారి స్ఫూర్తితో దర్శకులుగా మారిన వారే అధికం. ఎక్కువ చిత్రాలకు, ఏళ్లకి ఏళ్లు దర్శకత్వ శాఖలో శిష్యరికం చేయకపోయినా తమ అభిమాన హీరోలను తెరపైఎలా చూపించాలా? అని కలలు కన్నవారే వీరిలో అధికం. 'ఘాజీ' సంకల్ప్ రెడ్డి నుంచి కళ్యాణ్ కృష్ణ, చందూ మొండేటి, సుధీర్ వర్మ, సుధా కొంగర... ఇలా ఎందరో ఉన్నారు.
కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చి ప్రస్తుత తరం అభిరుచులను అర్దం చేసుకోలేని వారికి బాలయ్య, పవన్ వంటి వారు అవకాశాలు ఇస్తూ స్వయంకృతాపరాధం చేస్తున్నారు. రవిచావలి. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, పరుచూరి మురళి, మహాదేవ్.. ఇలా ఎందరి చేతిలోనే బాలయ్య గతంలో దెబ్బతిన్నాడు పరాజయాలు పట్టించుకోవల్సిన అవసరం లేదు కానీ మంచి టాలెంట్‌ను వెతికపట్టుకోవడం అవసరం. ఉదాహరణకు తనకు పెద్ద పెద్ద హిట్లిచ్చిన పి.వాసు, కె.ఎస్.రవికుమార్ చౌదరి, సురేష్ కృష్ణలను రజనీ కూడా పక్కన పెట్టి రంజిత్ పా వంటి దర్శకులతో పని చేస్తున్నాడు.
బాలయ్య చేసిన ప్రయోగాలలో బోయపాటి, క్రిష్ తప్పితే ఆయనకు విజయాన్ని అందించిన వారెవ్వరూ లేరు. గతంలో పి.వాసుతో బాలయ్య 'మహారధి' చేసి దెబ్బతిన్నాడు. అవుట్‌డేటెడ్ దాసరితో 'పరమవీరచక్ర' చేశాడు. మరలా ఇప్పుడు కె.ఎస్.రవికుమార్‌కు అవకాశం ఇచ్చాడు. పూరీ అంటే ఎలాగైనా మేజిక్కులు చేయగలడు గానీ రవికుమార్‌కి మాత్రం అంత సీన్ లేదంటున్నారు.