రాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడే కొద్ది మరలా రాజకీయ వేడి ఢిల్లీ స్థాయిలో రాజుకుంది. ఎండను మించిన సెగను రేకెత్తిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇప్పటికే డీలా పడి ప్రాంతీయ పార్టీగా మారిపోతున్న కాంగ్రెస్ ఈ సారి మోదీని అడ్డుకోకుంటే భవిష్యత్తులో ఆయన్ను అడ్డుకోవడం సాధ్యం కాదని భావిస్తోంది. అందుకే మిగిలిన పక్షాలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే సోనియమ్మ దీదీ మమతా బెనర్జీతో పాటు సీపీఐ, సీపీఎం వంటి వైరి పక్షాలతో కూడా మంతనాలు సాగిస్తోంది. కాగా ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ కాంగ్రెస్‌లో కీలకమైన వ్యక్తి. ఆయన్ను యూపీఏ ప్రభుత్వం రాష్ట్రపతిని చేసింది. తన పదవీ కాలంలో ప్రణబ్ తన బాధ్యతలను చక్కగానే నిర్వర్తించాడు. ఎవరికీ ఇబ్బందులు కలిగించలేదు. దీంతో బిజెపికి కూడా ఆయనంటే మంచి అభిప్రాయమే ఉంది.
ఇక కొత్తగా మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంథీని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలా? లేక ప్రణబ్‌కే మద్దతు తెలిపి బిజెపిని ఇబ్బంది పెట్టాలా? అని విపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఇక గాంధీ మనవడిని తెరపైకి తేవడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది కూడా కీలక పాత్ర. ఆ పేరు ఆమె తెరపైకి తెచ్చారు. కానీ అసలు గాంధీ కుటుంబాన్ని పక్కనపెట్టి, గాంధీ తోకను తగిలించుకున్న నెహ్రూ కుటుంబమే రాజ్యమేలుతోంది.
ఈ సందర్భంలో నిజమైన గాంధీ మనవడు అంటే దేశంలో కాస్త సానుకూల ప్రభావం ఉండే అవకాశం కలుగుతోంది. కాగా వచ్చే ఎన్నికల్లో తృతీయఫ్రంట్ మరలా ఊపిరిపోసుకుంటుందని, జయ మరణంలో ఇక ఈ ఫ్రంట్‌కు మమతా బెనర్జీ నాయకత్వం వహించే అవకాశాలున్నాయని, మోదీని డీకొట్టే సత్తా కేవలం దీదీకే ఉందని సీపీఎం కూడా అంటుండటం అనూహ్యపరిణామమనే చెప్పవచ్చు.