తెలుగులో సీనియర్ స్టార్స్ నలుగురు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. కాగా చిరంజీవి తాను ఎప్పుడో నటించిన 'మాస్టర్, మృగరాజు' చిత్రాలలో తన సొంత గొంతుతో పాటలు పాడేశాడు. ఇక నాగార్జున ఆ మధ్య 'నిర్మలా కాన్వెంట్' చిత్రంలో ఓ పాట పాడాడు. ఇటీవల వచ్చిన 'గురు' చిత్రం కోసం విక్టరీ వెంకటేష్ కూడా ఓ సింగేసుకున్నాడు. ఇక బాలకృష్ణ ఒక్కడే పెండింగ్ అని అందరూ భావించారు.
కాగా గతంలో బాలకృష్ణ కూడా వేదికలపై ఒకట్రెండు సందర్భాలలో తన గానమాధుర్యం చూపించాడు. కానీ ఇప్పటి వరకు తన చిత్రంలో తానే పాట మాత్రం పాడలేదు. మొత్తానికి ఆలోటు కూడా పూర్తయిపోయింది. బాలకృష్ణ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో అనూప్‌రూబెన్స్ స్వరకల్పనలో భాస్కరభట్ట రవికుమార్ సాహిత్యాన్ని అందించిన పాటతో బాలయ్య గొంతు సవరించుకున్నాడు.దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
కాగా యూనిట్ మాత్రం బాలయ్య అద్భుతంగా, ఎంతో ఎనర్జీతో పాడాడని, ఈ చిత్రానికి ఆ పాట హైలైట్ అవుతుందని, ప్రొఫెషనల్ సింగర్‌గా ఆయన పాడాడని పొగడ్తలు గుప్పిస్తున్నారు. ఇక బాలయ్య ఇంత కాలం తన చిత్రాలలో పవర్‌ఫుల్ డైలాగ్‌లు చెప్పడానికే పరిమిమయ్యాడు. ఆయన నోటి వెంట వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్‌ల కోసమే అభిమానులు మరలా మరలా చిత్రాలు చూసేవారు.
కానీ వక్తగా మాత్రం బాలయ్యకు మంచి పేరు లేదు. ఏదేదో మాట్లాడుతాడనే చెడ్డపేరు ఉంది. మరి పాటతో బాలయ్య తన అభిమానులను కాకుండా సామాన్య ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఎంతగా అలరిస్తాడో వేచిచూడాల్సివుంది. ఇక చిరంజీవి టీ పై పాట పాడితే, వెంకీ, బాలయ్యలు మందుపై పాటలు పాడారు. మరి ఈ 'మందుబాబుల' మందు పాటలు ఏ మాత్రం అలరిస్తాయో చూడాలి...!