మహేష్ బాబు 'స్పైడర్' లుక్ బయటికి వచ్చేవరకు మహేష్ ఫ్యాన్స్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక ఫస్ట్ లుక్ బయటికి వచ్చిందో లేదో ఫస్ట్ లుక్ టీజర్ కోసం మళ్ళీ రభస మొదలు పెట్టారు. అలాగే 'స్పైడర్' మూవీ ముందుగా జూన్ లో విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ కొన్ని కారణాలవల్ల అది కాస్తా పోస్ట్ పోన్ చెయ్యడంతో మహేష్ అభిమానులు 'స్పైడర్' రిలీజ్ కోసం మళ్ళీ మహేష్ మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. అయినా మహా.... పోస్ట్ పోన్ అయితే ఎన్ని రోజులు అవుతుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ డైరెక్టర్ మురుగదాస్ మీద కూడా గుర్రుగా వున్నారు. అయినా మురుగదాస్ కావాలని సినిమాని లేట్ చెయ్యడు కదా.. ఇక మురుగదాస్ ని తక్కువ అంచనా వెయ్యడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయిన దాఖలాలే ఎక్కువ వున్నాయి. మరి అలాంటి దర్శకుడితో మహేష్ సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ కూడా ఎంతగా ఆలోచించాలి.
మరి 'బాహుబలి' చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఐదేళ్లు వేచి చూసారు. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ రాజమౌళి మీద ఎంత నమ్మకం లేకపోతే అంతలా వాళ్ళు ఎదురు చూశారు. ప్రభాస్ కూడా ఫ్యాన్స్ ని ఎంతో డిజప్పాయింట్ చేసాడు. కానీ వారు అర్ధం చేసుకున్నారు. 'బాహుబలి' కోసం మరే ఇతర ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా.... ప్రభాస్ బాహుబలికి తన ఐదేళ్ల సమయాన్ని త్యాగం చేసాడు. అంతలా చేసిన ప్రభాస్ కి 'బాహుబలి' విజయం ఎంతో ఊరటనిచ్చింది. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా 'బాహుబలి' కోసం అంతలా ఎదురు చూసిన ఫలితం అనుభవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలిని వేయినోళ్ల కీర్తిస్తున్నారు. కలెక్షన్స్ లో కొత్త రికార్డులని తిరగరాస్తూ దూసుకుపోతుంది తమ అభిమాన హీరో బాహుబలి వంటి చారిత్రాత్మక హిట్ కొట్టడం తమ విజయంగా వారు భావిస్తున్నారు.
మరి మహేష్ అభిమానులు కూడా ప్రభాస్ అభిమానులను చూసి నేర్చుకుంటే బావుంటుంది. మహేష్ 'స్పైడర్' కోసం గత ఏడాది నుండి ఎదురు చూస్తున్న అభిమానులు మరో మూడు నెలలు ఆగలేరా? ఎలాగూ 'స్పైడర్'... వచ్చే ఆగష్టు గాని సెప్టెంబర్ లో గాని విడుదల చేస్తామని చెబుతున్నారు. మరి అప్పటివరకు వీరు ఏ గోల చెయ్యకుండా కామ్ గా ఉంటే మంచి అవుట్ ఫుట్ కోసం వాళ్ళ హీరో కష్టపడతాడు. లేదంటే ట్విట్టర్ లో డేట్స్ చెప్పుకుంటూ కూర్చుంటాడు.