ఏ నాయకుడిని చూసినా ఏమున్నది గర్వకారణం అనిపిస్తోంది. ఎవరొస్తే మనకేంటి అనే ధోరణిలో ఓటర్లు కూడా ఉన్నారు. కాగా కిందటి ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా తెస్తానని చెప్పింది. ఆ తర్వాత మాట మార్చి కేంద్రం చెప్పిన ప్రత్యేక ప్యాకేజీనే మహాభాగ్యం అని చెప్పింది. ఇదేతడవుగా ప్రతిపక్ష వైసీపీ నాయకులు, దాని అధినేత వైఎస్ జగన్ టిడిపిపై ప్రత్యేకహోదా కోసం పోరాటానికి పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదానే సంజీవని అని, సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ఓటుకు నోటు కేసు నుంచి బయటకు పడటానికి మాత్రమే కేంద్రానికి భయపడి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా జగన్‌కి కాస్త అనుకూలంగానే మాట్లాడారు. కానీ తాజాగా జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చాడు. పనిలో పనిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి బలపర్చే అభర్థిని గెలిపించుకునే బలం బిజెపికి ఉందని, కాబట్టి రాష్ట్రపతిగా బిజెపి ప్రతిపాదించిన వ్యక్తికి తాము బేషరత్తుగా మద్దతిస్తానని చెప్పడం పెను వివాదానికి కారణమైంది.
ఒక వేళ వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీని గెలిపించి, జగన్‌ని సీఎంను చేస్తే, కేంద్రంలో కూడా మోదీ సర్కారే వస్తే ఏపీకి ప్రత్యేక హోదాను ఎలా సాధించి చూపిస్తాడో జగన్ కాస్త క్లారిటీ ఇవ్వాలి. అవినీతి, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యాన్ని బిజెపి ప్రకటించగానే జగన్ డిల్లీ వెళ్లి మోదీని కలుసుకోవడం వివాదస్పదమవుతోంది. అసలు బిజెపికి పూర్తి మెజార్టీ ఉన్నందువల్ల రాష్ట్రపతి పదవికి విపక్షాలు పోటీ పెట్టకపోవడమే మంచిదని జగన్ అభిప్రాయపడ్డాడు.
దీంతో వామపక్షాలు జగన్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అన్ని సీట్లలో గెలుస్తాడనే తన అభ్యర్ధులను పోటీకి పెట్టాడా? అని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వాస్తవానికి బిజెపి, ఎన్డీఏ కూటమికి రాష్ట్రపతి పదవిని దక్కించుకునేందుకు మరికొన్ని పార్టీల మద్దతు అవసరం ఉంది. రాష్ట్రపతి, స్పీకర్ వంటి పదవులకు ఏకగ్రీవ నిర్ణయం మంచిదే అయినా జగన్ ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అసంబద్దంగా ఉంది.