మొత్తానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమి చెప్పినా కూడా ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంతో ఎక్కువ మంది ప్రజలు మద్యం తాగి వేగంగా కారును నడపడమే కారణమంటున్నారు. ఇక ఇలా జరిగిన పలువురు ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోటశ్రీనివాసరావు, బాబూమోహన్, హరికృష్ణ వంటి వారి కొడుకుల మరణాలు ఇలాంటి విషయాల వల్లే జరిగాయంటున్నారు.
ఇక నారాయణ కొడుకు మృతి తర్వాత జె.సి.దివాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖులకు డబ్బు, వృత్తి, బిజీ కారణంగా తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారని, వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి చేస్తున్నారో కూడా తల్లిదండ్రులకు తెలియడం లేదని నిక్కచ్చిగా చెప్పాడు. జెసిని కొందరు తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ చాలా విషయాలలో ఆయన సరిగా, నిర్మోహమాటంగా మాట్లాడుతుంటాడు. ఇక ప్రమాదం జరిగిన సమయం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. జెసి మాట్లాడుతూ, రాత్రి 10, 11 గంటల తర్వాత బార్లు, పబ్బులు మూసేయాలని సూచించాడు. కాగా ఇప్పుడు దీనిపై మరలా చర్చ ఆరంభమైంది. మద్యం అనేది పేదలు, సామాన్యులతో పాటు కోటీశ్వరుల మనశ్శాంతిని కూడా పోగొడుతోంది. జేబు, ఆరోగ్యం గుల్ల చేస్తోంది. దేశంలో జరిగే వాహన ప్రమాదాలలో 75శాతం వరకు మద్యం మత్తులో జరిగేవని పలు సర్వేలు చెబుతున్నాయి. అసలు ప్రభుత్వాలు మద్యం, పొగాకు ఉత్పత్తుల ఆదాయంతో నడవడం సిగ్గుచేటు.
ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో ధైర్యంగా సంపూర్ణ మధ్యపాన నిషేధం తెచ్చాడు. దాంతో ఆ కాలంలో ఈ విచ్చలవిడి కాస్త తగ్గింది. కొందరు గుట్టు చప్పుడు కాకుండా మందు తాగి, మౌనంగా ఉండిపోయేవారు. చెన్నై వంటి బార్డర్ ఏరియాలలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, తడ వంటి ప్రాంతాల ప్రజలు ఒకరోజు అదే పనిగా చెన్నై వెళ్లి, ఒకరోజంతా లాడ్జిలలో, హోటళ్లలో తాగి వచ్చేవారు. ఎవరైనా తాగినా కూడా పోలీసులకు, తమ పరపతికి భయపడి కొంచెం దూరంగానే ఉండేవారు. కానీ మద్యనిషేధం విఫలమైందని చెప్పి మరలా బాబుగారు మద్యాన్ని ఏరులైపారిస్తున్నారు. మరోవైపు గుట్కాలు, మద్యంపై నిషేదాలను కొన్ని రాష్ట్రాలు బాగా అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మద్యాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నిషేధం విధించాలని, పొగాకు ఉత్పత్తులను కూడా ఒక రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా అమలు చేస్తే భావితరాల జీవితాలు బాగుపడతాయనే వాదన వినిపిస్తోంది. ఇది మన నాయకుల చెవులకు ఎక్కుతుందా? లేదా? అనేది చూడాలి.