'బాహుబలి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధిస్తూ 1500కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. దీంతో కొందరు తమ తమ హీరోల పాత చిత్రాల కలెక్షన్లను 'బాహుబలి'తో పోలుస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి- అతిలోక సుందరి శ్రీదేవి కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'జగదేక వీరుడు-అతిలోక సుందరి' చిత్రం కలెక్షన్లకు 'బాహుబలి2' కలెక్షన్లకు ముడిపెడుతూ, బోడిగుండుకు మోకాలికి లింక్ పెడుతున్నారు.
నాటి థియేటర్లలో టిక్కెట్ల ధర కేవలం 10,20,30,50 రూపాయలే ఉండేవని, కానీ ఆనాడు ఆ చిత్రం కొన్ని కోట్లు కొల్లగొట్టిందంటున్నారు. నిజమే.. ఆ చిత్రం తుఫాన్ సమయంలో వచ్చి బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. కానీ దానికి 'బాహుబలి' కలెక్షన్లకు ముడిపెట్టడం సరికాదు. నాడు టివిలో సినిమా చానెల్స్ లేవు. ఇంకా శాటిలైట్ చానెల్స్ పేరే నాడు తెలియదు. నాడున్న ఏకైక వినోద సాదనం కేవలం సినిమా మాత్రమే. ఆనాడు సినిమా బాగుంటే కుటుంబసమేతంగా రెండు మూడు సార్లు కూడా చిత్రాలను చూసే సంస్కృతి ఉండేది. కానీ నేడు అలా లేదు.
సగానికి పైగా సినీ ప్రేమికులు, మహిళలు టీవీ సీరియళ్లకు, రోజుకు ఐదారు చిత్రాలు ప్రసారం చేసే చానెల్స్‌కు అలవాటుపడిపోయారు. సినిమా ఎంతో బాగుంటే గానీ నేటి ధరల దెబ్బకు ధియేటర్లకు రావడం లేదు. ఓ మూడు నాలుగు నెలలు ఆగితే ఆ చిత్రమే టీవీలో ప్రసారమవుతుందనే ఆలోచనలతో ఉన్నారు. అలా సిని ప్రేక్షకుల శాతం దారుణంగా పడిపోతోంది. కాబట్టి నాటి చిత్రాలను, 'బాహుబలి' వంటి చిత్రాల కలెక్షన్లతో పోల్చడం అసంబద్దం..!