పవన్ ప్రస్తుతం ఉత్తరాది పెత్తనం, దక్షిణాదిపై సవతి ప్రేమపై ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిలో నిజముందని కొందరు ఒప్పుకుంటుంటే, ఇది దేశ సమగ్రతకు పెను ప్రమాదమని, స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ ఉత్తరాది, దక్షిణాది ఏమిటని కొందరు వాదిస్తున్నారు. ఇక ఈ విషయం చాలా సున్నితమైంది. కాబట్టి ఇరు పక్షాలు మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది. కిందట మేము పవన్‌కి మంచి సలహాదారుడు కావాలని, కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైతుల మిర్చి సమస్యతో పాటు పవన్ పాకిస్తాన్ సైన్యం ఇద్దరు భారత జవాన్లను ఊచకోత కోసి, ముక్కలు ముక్కలుగా నరికేసిన విషయాన్ని కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేదని సూచించింది.
ఇక తాజాగా టీటీడీ ఈవో నియామకంలో పవన్ వాదనలో నిజమున్నా కూడా ఆయన తనలోని భావాలకు మాటలు ఇచ్చే క్రమంలో తప్పు చేశాడు. తనపై తాను ఉత్తరాది ద్వేషి అనే ముద్ర వేయించుకున్నాడు. స్వామి స్వరూపానందలాగా లాజిక్‌గా మాట్లాడలేకపోయాడు. కానీ తాజాగా పవన్ తన పార్టీ జనసేన లెటర్‌హెడ్‌పై ఆ పార్టీ ఉపాధ్యక్షుడి పేరుతో తన మాటలను వక్రీకరించవద్దని తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. సూటిగా, స్పష్టంగా, తనలోని భావాలను అందరికీ అర్దమయ్యేలా, వివాదాస్పదం కాకుండా, తనకు చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం పవన్‌కి ఉంది.
ఇంతకాలం తన పేరుతో ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిన పవన్ ఇప్పుడు పార్టీ ఉపాధ్యక్షుడి పేరుతో తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పవన్ సినిమాలలో కూడా తన భావ జాలాన్ని చేతలతో చూపించాల్సిన అవసరం వచ్చింది. 'దబాంగ్, ఓమైగాడ్' వంటి బాలీవుడ్ రీమేక్‌లను, 'సర్దార్‌గబ్బర్ సింగ్' వంటి చిత్రాలను బాలీవుడ్‌లో రిలీజ్ చేయడం మరోసారి చేయరాదు. 'వీరం' టైప్‌లో దక్షిణాది చిత్రాలనే రీమేక్ చేయాలి. ఇక హీరోయిన్లుగా కూడా శృతిహాసన్, కీర్తిసురేష్, అను ఇమ్మేన్యువెల్ వంటి వారితో నటించాలే గానీ కాజల్‌తో పాటు ఉత్తరాది భామలపై ఉన్న ప్రేమను పక్కనపెట్టి తన చేతలతో చూపిస్తే గానీ ఆయన మాటలను, ఆయన చిత్తశుద్దిని ఎవ్వరూ నమ్మేలా కనిపించడం లేదు...! లేకపోతే అడుసు తొక్కనేనా..కాలు కడగనేలా..అనే సామెత చెప్పాల్సి వస్తుంది.