'బాహుబలి' ముంందు తర్వాత రాజమౌళి రేంజ్‌లో పెద్ద మార్పు వచ్చింది, నిర్మాతలు, స్టార్స్ కూడా జక్కన్నతో ఓ చిత్రం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. 'దండాలయ్యా... దండాలయ్యా.. నువ్వు మాతోనే ఉండాలయ్య..' అని పాడుతున్నారు. కానీ జక్కన్న మాత్రం ఫ్యామిలీ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో మూడు నెలల పాటు ఆయన తన తదుపరి చిత్రంపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఇక ఆయన ఎప్పుడో దానయ్య, కె.ఎల్.నారాయణలకు సినిమాలు చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడట.
దీంతో తెరపైకి బన్నీ, నాని, ఎన్టీఆర్ వంటి పేర్లు వచ్చాయి. మహేష్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. మరోవైపు రజనీకాంత్ నుంచి బాలీవుడ్ స్టార్స్, నిర్మాతలు జక్కన్న కంట్లో పడాలని కుస్తీలు పడుతున్నారు. కొన్ని కార్పొరేట్ సినీ నిర్మాణ సంస్థలు ఇప్పటికే జక్కన్నను ఒప్పించేందుకు తీవ్ర లాబీయింగ్ చేస్తున్నారు. తమకున్న పరిచయాలు, ఇతర పద్దతులలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకులతో పాటు రాజమౌళి కుటుంబసభ్యుల చేత కూడా తమకే చిత్రం చేయాలని రికమండ్ చేయిస్తున్నారు.
'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే పాయింట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆసక్తిని రేకెత్తించిందో ఇప్పుడు జక్కన్న తదుపరి చిత్రం కూడా అంతగా చర్చనీయాంశం అయింది. కాగా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చిత్రాలు చేయలని ఎందరో నిర్మాతలు క్యూలో ఉన్నప్పుడు చిరు వారందరినీ సంతృప్తి పరచడం కోసం ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కలిపి ఓ చిత్రం చేసిన సందర్భలున్నాయి. పరిస్థితులు చూస్తుంటే జక్కన్న కూడా అదే పని చేసే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది.