టిడిపి వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌ను ఆర్థిక ఉన్మాదిగా పేర్కొంటోంది. ఆయన ఎన్నో కేసులో ఉన్నాడని, నిందితుడు అనకుండా ఇంకా దోషిగానే పేర్కొంటోంది. గతంలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి పలువురు జాతీయ నేతలను కలిసినప్పుడు ఓ ఆర్థిక నేరస్దుడికి అపాయింట్‌మెంట్ ఎలా ఇస్తారు? అని చంద్రబాబుతో పాటు ఆయన తమ్ముళ్లు కూడా ఒకకాలిపై లేచారు. ఈసారి ఆయనకు అనూహ్యంగా ప్రధాని మోదీ కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో టిడిపి నాయకులు షాక్‌తిన్నారు.
మోదీని అపాయింట్‌మెంట్ ఇచ్చినందుకు ఆయన్ను విమర్శించే ధైర్యం బాబుకు ఆయన తమ్ముళ్లకు లేవు. మరోవైపు ఇది కావాలని బిజెపి అనుసరిస్తున్న వ్యూహంగా అర్ధమవుతోంది. ఇంతకాలం బిజెపికి ఏపీలో తానే దిక్కని చంద్రబాబు భావిస్తున్నాడు. కానీ మోదీ జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వడం ద్వారా దానికి చెక్‌పెట్టాడు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో వైసీపీతోనైనా కలుస్తామనే సంకేతాలు బాబుకు అందించాడు. కాగా ఇప్పటికే స్థానిక బిజెపి నాయకులు బాబును ఓ ఆటాడుకుంటున్నారు.
మరోవైపు పవన్ వైఖరిపై బిజెపి గుర్రుగా ఉంది. టిడిపిని విమర్శించకుండా కేవలం బిజెపినే ఆయన టార్గెట్ చేయడాన్ని బిజెపి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ టిడిపి పవన్ విషయంలో మెతకగా వ్యవహరిస్తోంది. పవన్ కూడా టిడిపిని టార్గెట్ చేయడం లేదు. టిడిపి నాయకులు పవన్‌ని తిప్పికొట్టకుండా ఆయన్ను తమ స్వలాభం కోసం ప్రోత్సహిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్నికలలోకి దిగితే దాని ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి, తమకే మేలు చేస్తుందనే ఆలోచనలో చంద్రబాబు అండ్ కో ఉన్నట్లు బిజెపి అనుమానిస్తోంది. దీంతో జగన్‌కు మోదీ మద్దతివ్వడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.