క్రికెట్ దేవుడు... కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకంలో తనకంటూ ఓ ప్రత్యేక పుస్తకాన్ని రచింపజేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. జేమ్స్ ఎరిక్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. గతంలో క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక మహేంద్రసింగ్‌ధోని జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం మంచి హిట్టయింది. అయితే గత రెండు చిత్రాలలో వారి పాత్రలను వేరే వారు పోషించారు. కానీ సచిన్ జీవిత చరిత్రలో ఆయనే స్వయంగా నటిస్తుండటం విశేషం.
'సచిన్- ఎ బిలియన్ డ్రీమ్స్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఇక టీజర్‌తో సంచలనం సృష్టించిన ఈ చిత్రంలోని 'సచిన్..సచిన్' అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాటను సుఖ్విందర్ సింగ్ పాడాడు. కాగా ఈ పాటను వింటే సచిన్ అభిమానుల్లోనే కాదు.. క్రికెట్ ప్రేమికుల రోమాలు కూడా నిక్కబొడుచుకోవడం ఖాయమని చెప్పవచ్చు.
కాగా ఈ చిత్రం ఓ డాక్యుమెంటరీలాగా ఉండదని, పూర్తి స్థాయి కమర్షియల్ హంగులతో ఈచిత్రం రూపొందిందని సమాచారం. ఇటీవల సచిన్ 'నా గురించి మీరు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానాలుంటాయి. క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి. డేట్ సేవ్ చేసుకోండి..' అని సినిమా రిలీజ్ డేట్‌ను మే26 అని ప్రకటించడం విశేషంగా చెప్పాలి.