స్వర్గీయ ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్లలో ఒకరు, చంద్రబాబుకు తోడల్లుడయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో పాటు నేను కూడా ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచామని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు తనతోపాటు బాలకృష్ణ, హరికృష్ణలు కూడా సాయంచేశారు. బాబు తాను సీఎం అయితే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని వాగ్దానం చేశాడు.
కానీ పక్కలో బల్లెంలా మారుతానని ఇవ్వలేదు. నేను లక్ష్మీపార్వతిని ఎప్పుడు చేరదీయలేదు. చంద్రబాబు లక్ష్మీపార్వతి కారు డోర్ తీసేవాడు. ఎన్టీఆర్ వెన్నుపోటులో ఆయన కూతుళ్లకి సంబంధం లేదు. ఇక నాకు చిన్న విషయానికే అలిగే మనస్తత్వం ఉంది. అది నా కెరీర్‌కు మైనస్ అయింది. ఎన్టీఆర్ కూడా అలగడం తప్పితే దగ్గుబాటిలో మంచి కమిట్‌మెంట్ ఉందని చెప్పేవాడు.
ఇక ఎన్టీఆర్ చంద్రబాబును జామాత దశమగ్రహంగా వ్యాఖ్యానించాడు. జూనియర్ ఎన్టీఆర్‌కు సినిమా కళతో పాటు రాజకీయకళ కూడా బాగా తెలుసు. ఆయన భవిష్యత్తుపై నేనేమీ మాట్లాడలేదు. చంద్రబాబుకు సరైన వారసుడు లోకేషా? బాలకృష్ణా లేక ఎన్టీఆరా అనేది త్వరలో తేలుతుంది. బాలకృష్ణకు కూడా వారసత్వంపై ఆశ ఉంది. లేకపోతే ఎమ్మెల్యే ఎందుకయ్యాడు? కనీసం మంత్రి పదవినైనా ఆయన కోరుకుంటాడు.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పశ్చాతాపంతో ఈ వ్యాఖ్యలు చేశాడా? లేక దీనివెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? అనేది చర్చనీయాంశం అయింది.