తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అశోక్‌కుమార్ సింఘాల్ నియామకంపై పలు విమర్శలు వస్తున్నాయి. గత ఈవో సాంబశివరావు ఎంతో బాగా పనిచేస్తున్నా కూడా ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి ఓ ఉత్తరభారతదేశానికి చెందిన వ్యక్తిని కేంద్రం, చంద్రబాబు నాయుడులు నియమించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఏపీలో పవన్ వల్ల ఉత్తర, దక్షిణాది వివక్షపై జోరుగా చర్చ సాగుతోంది. తాజా నిర్ణయం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసేలా ఉంది.
కాగా ఈ విషయంపై స్వామి స్వరూపానంద మాట్లాడుతూ, ఉత్తరప్రాంతం వారికి ఆగమశాస్త్రంపై పట్టు ఉండదని, వారు దానిని అనుసరించరని తెలిపాడు. అక్కడ ఆగమాలతో సంబంధం ఉండదన్నాడు. కానీ తిరుపతిలో అన్నీ ఆగమాల ప్రకారమే జరుగుతాయని తెలిపాడు. ప్రభుత్వ అనాలోచిత చర్యకు ఇది పరాకాష్టగా ఆయన అభివర్ణించాడు. కావాలంటే ఈ విషయంలో తాము న్యాయస్థానాలకు కూడా వెళ్తామన్నాడు.
ఇక పవన్ మాట్లాడుతూ, నేనేమీ ఉత్తరాది ద్వేషిని కాదు. ఉత్తరాదికి చెందిన ఐఏయస్‌కి టిటిడి ఈవో పదవి ఇచ్చారు. మరి మన దక్షిణాదికి చెందిన వారిని ఉత్తరప్రాంతంలోని అమరనాథ్, వారణాశి, మధుర వంటి పవిత్ర ప్రదేశాలకు అధికారులుగా నియమించగలరా? అని ప్రశ్నించాడు. మొత్తానికి అమెరికాలో ఉన్న చంద్రబాబుకు ఈ అంశం తీవ్ర పరిణామాలను కలిగించేలా కనిపిస్తోంది....!