చంద్రబాబు మంచి రాజనీతిజ్ఞుడే కానీ ఈ మధ్య ఆయన చేసే వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తూ వివాదాలకు కారణం అవుతున్నాయి. సింగపూర్ వెళ్లినప్పుడు ఏపీని సింగపూర్‌లా చేస్తానని, చైనా వెళ్లినప్పుడు చైనాలా చేస్తానని చెప్పే బాబు ఇప్పుడు అమెరికా వెళ్లాడు కాబట్టి ఆయన ఇక మన ఏపీని అమెరికాలాగా చేస్తానని అంటాడని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగా ఇటీవల బాబు ఇంకా తాత్కాలిక సచివాలయం తప్ప ఏమీ లేని అమరావతిని గ్రేటర్ అమరావతి అని పేర్కొన్నాడు. చాలా పెద్ద పెద్ద నగరాలను ఉదాహరణగా గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ నోయిదా వంటి వాటినే గ్రేటర్ అని పిలుస్తారని, కానీ బాబుమాత్రం అమరావతిని గ్రేటర్ అమరావతి అని పిలవడం ఏమిటనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇక మన విభజన కష్టాలను అమెరికాలోని పలు కంపెనీల అధినేతల వద్ద, అక్కడి పలు రాష్ట్రాల గవర్నర్ల వద్ద వెళ్లగక్కడం మనని మనం కించపరుచుకోవడమేనని, అడుక్కోవడానికి అమెరికా వెళ్లడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
మరో జోక్ ఏమిటంటే.. 'బాహుబలి'లోని మహిష్మతి సామ్రాజ్యాన్ని గ్రాఫిక్స్‌లతో అదరగొట్టిన రాజమౌళి తీసిన 'బాహుబలి' చిత్రాన్ని ఆస్కార్‌కు పంపుతానని చెప్పడంతో, ఆస్కార్‌కు మనం ఏ సినిమాని స్వయంగా నామినేట్ చేసే పరిస్థితి ఉండదని, దానికి ఎన్నో నియమాలున్నాయని, తన పలుకుబడితో తన అనుకున్నవారికి నందులు, పద్మశ్రీలు ఇప్పించినంతగా ఆస్కార్ ఇప్పించడం జరిగే పనికాదని బాబుకు తెలియదని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.