తాజాగా ఒకేరోజున ఇద్దరు హీరోలు నటించిన ట్రైలర్స్ విడుదలయ్యాయి. ఒకటి యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'ఆరడగుల బుల్లెట్' కాగా రెండోది శర్వానంద్ 'రాధ'. ఇక గోపీచంద్ విషయానికి వస్తే ఆయన 'లౌక్యం' తర్వాత నటించిన 'జిల్, సౌఖ్యం' పెద్దగా అలరించలేదు. దాంతో ఈ యాక్షన్ హీరో వరుసగా 'ఆరడుగుల బుల్లెట్, గౌతమ్ నందా, ఆక్సిజన్'లతో పూర్వవైభవం సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజాగా విడుదలైన 'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ చూస్తుంటే చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. యాక్షన్‌తోపాటు ఫాదర్ సెంటిమెంట్ కూడా కలగలిపిన చిత్రంగా అనిపిస్తోంది. ఇక బెజవాడ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండటం, బి.గోపాల్ వంటి దర్శకుడు తెరకెక్కిస్తుండటం విశేషం. ఇక ఈ ట్రైలర్‌లో డైలాగ్‌లు బాగా ఉన్నాయి. ఈచిత్రం మే నెలలో విడుదలకు రెడీ అవుతోంది.
ఇక తాజాగా విడుదలైన మరో చిత్రం శర్వానంద్ నటిస్తున్న 'రాధ'. టీజర్‌తోనే మెప్పించిన ఈ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. ఒకప్పుడు శర్వానంద్ చిత్రం అంటే పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ 'రన్ రాజా రన్' నుంచి పరుగు మొదలుపెట్టిన శర్వా తన 10 నుంచి 15 కోట్ల మార్కెట్‌ను 'శతమానం భవతి'తో 30కోట్లకు పెంచుకున్నాడు. కాగా 'రాధ' చిత్రంలో చిలిపి, అల్లరి పోలీసుగా శర్వా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే 'గబ్బర్‌సింగ్, పటాస్' చిత్రాల తరహాలో కితకితలు పెడుతూనే మాస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో శర్వానంద్ వస్తున్నాడని అర్ధమైంది. కాగా ఈ చిత్రం మే12న విడుదలకానుంది.