పవన్ ఎప్పుడైతే తాను రాష్ట్రం విడిపోయినప్పుడు అన్నం కూడా తినకుండా బాధపడ్డానని తెలిపాడో ఆనాటి నుంచి పవన్‌ను ఏపీ వ్యక్తిగా, తెలంగాణను పట్టించుకోవడం లేదనే వాదనను కొందరు తెరపైకి తెచ్చారు. కానీ పవన్ ఆనాడు చెప్పింది ఒక్కటే. ఎంతో గౌరవంగా తెచ్చుకోవాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం వివాదం చేసిందని మాత్రమే ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత కూడా ఆయన సెక్షన్ 8 వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడారు. ఇక ఉస్మానియా విద్యార్ధుల సమస్యలపై కూడా స్పందించారు.
ఇక ఇప్పుడు ఆయన మరోసారి కేంద్రాన్ని చెడుగుడు ఆడుకున్నాడు. మిర్చి సమస్య రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతులను తీవ్రంగా వేధిస్తుంటే.. కేంద్రం ఆంధ్రా నుంచి ఎక్కువ మిర్చిని కొనుగోలు చేసి, తెలంగాణకు తక్కువ మొత్తం కొనుగోలు చేయడంపై అసంతృప్తి లేవనెత్తారు.దీనిద్వారా తెలుగు ప్రజల మద్య మరోసారి కేంద్రం చిచ్చుపెడుతోందని తీవ్ర స్వరంతో అన్నారు. ఇక మిగులు మిర్చి పరిస్థితి ఏమిటి? తెలంగాణ మిర్చి మిగులు సంగతేమిటంటూ తన వాదన వినిపించారు.
ఇది వాస్తవమే. కేవలం చంద్రబాబు ఎన్టీయే మిత్రపక్షం కాబట్టి ఆంధ్రాపై ఎక్కువ ప్రేమ చూపించి, కేసీఆర్ ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని మరోసారి తెలుగు ప్రజల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇక కేంద్రం తీరుపై టీఆర్‌ఎస్‌తో పాటు పలు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించాడు. మరోవైపు ఏపీ వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి కూడా కేంద్రం తీరును తప్పుపట్టారు. కాబట్టి నాకు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమే అని చెప్పే ఆంధ్రా సీఎం, ఇతర తెలుగు తమ్ముళ్లు తెలంగాణ సమస్యలు ప్రస్తావించడం లేదు. ఇక వైసీపీ అయితే తెలంగాణ సమస్యలను ఎప్పుడో వదిలేసింది. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు సరికొత్త చర్చను రేకెత్తిస్తున్నాయి.