బాహుబలితో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అసలు ప్రభాస్ బాహుబలి మొదలు పెట్టకముందే హిట్ ట్రాక్ లో ఉన్నాడు. వరుస సినిమాలు హిట్ అవడం... బాహుబలి కి ప్రపంచ వ్యాప్తంగా పేరు రావడంతో ప్రభాస్ తర్వాతి చిత్రాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో చిత్రాన్ని రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సాహో చిత్ర టీజర్ విడుదలై సాహో పై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం హాలీవుడ్ స్టయిల్లో తెరకెక్కుతోందని ఆ టీజర్ చూస్తుంటేనే తెలుస్తుంది.
ఈ నెలాఖరులో సెట్స్ మీదకెళ్లనున్న సాహో చిత్రానికి ఇంకా హీరోయిన్ ఎవరనే విషయం ఫైనల్ కాలేదు. కానీ విలన్ మాత్రం దొరికినట్లు చెబుతున్నారు. మూడు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విలన్ గా రామ్ చరణ్ ధృవ చిత్రం లో చేసిన అరవింద్ స్వామి.. సాహో చిత్ర విలన్ గా ఎంపికైనట్లు వార్తలొస్తున్నాయి. మరి ధ్రువ చిత్రంలో విలన్ గా దుమ్ము దులిపిన అరవింద్ స్వామి ఇప్పుడు సాహో చిత్రంలో ఇంకెంతగా నటిస్తాడో.... చిత్రం విడుదలయితే గాని తెలియదు.
ఇక ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించే భామ కోసం చిత్ర యూనిట్ పెద్ద కసరత్తే చేస్తుంది. అయితే సాహో చిత్రానికి హీరోయిన్ గా ఎలాగైనా బాలీవుడ్ భామని తీసుకోవాలని చూస్తున్నారట సుజిత్ అండ్ కో. ఇప్పటికే రేష్మిక మందన్న, అలియా భట్, తమన్నా ల పేర్లు ప్రభాస్ గా జోడిగా వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఎవరిని ఎంపిక చేస్తారో కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.