సినిమా కథలకు కుస్తీ అవసరం లేదు..కాస్త సృజనాత్మక ఉంటే చాలు..!
ఓ కొత్త కథ పుట్టాలంటే ఏదో బ్రహ్మపదార్ధంగా చూడాల్సిన పనిలేదు. కుక్కపిల్ల, సబ్బుబిల్ల.. ఏదీ కాదు కవితకనర్హం అన్నట్లుగా సినిమా కథలు ఎందులోనుంచైనా పుట్టవచ్చు. రామాయణం, భారతం, భాగవతం వంటి వేదాలు, పురాణాలు, అందులోని పాయింట్స్, పాత చిత్రాల నుంచి స్ఫూర్తి, కాపీ కొట్టడం, సమకాలీన పరిస్థితులను, సమస్యలను అధ్యయనం చేయడం, రోజూ పత్రికల్లో, టీవీ చానెల్స్‌లో వచ్చే వార్తల ఆధారంగా చిత్ర కథలను తయారు చేయవచ్చు. కాకపోతే పాత సారాను కొత్త సీసాలో నింపి, కొత్త ట్రీట్‌మెంట్ ఇవ్వగల సత్తా ఉండాలి.
ఇదంతా ఎందుకంటే తాజాగా సోషల్ మీడియాలో రాజమౌళికి భారతం, రామాయణాలపై ఉన్న పట్టు ఇంకెవ్వరికీ లేదని కొందరు రాజమౌళిని పొగుడుతూ ఇతరులను కించపరుస్తున్నారు. రాజమౌళి మంచి కమర్షియల్ దర్శకుడే.. కాదనలేం. కానీ ఆయన ఒక్కడే కాదు.. ఇప్పటివరకు ఇతిహాసాలు, పురాణాల ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇక దాసరి నుంచి మణిరత్నం వరకు అలా కథలను తయారుచేసుకున్నవారే.
ఒక్కసారి మణిరత్నం 'దళపతి' చూడండి. కేవలం కర్ణుడు, దుర్యోధనుల స్నేహం మీద ఈ చిత్రం కథను ఆయన వండివార్చాడు. 'రావణ్' కూడా అలాంటి చిత్రమే. ఇక 'నాయకుడు' చిత్రం 'గాడ్‌ఫాదర్' ఆధారంగా తీశాడు. వర్మ ఇప్పటివరకు 'గాడ్‌ఫాదర్'ని అటుతిప్పి ఇటుతిప్పి ఎన్నో హిట్లు కొట్టాడు. 'సీతామాలక్ష్మి' చిత్రాన్ని మార్చి 'రంగీలా' తీస్తే జనం బ్రహ్మరథం పట్టారు. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. కాబట్టి రాజమౌళిని పొగడండి కానీ మిగిలిన వారిని చులకన చేయవద్దు.