పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానం కూడా మన నాయకులకు, బడా బడా వ్యక్తులకు తమ దర్పం.. అధికారం చూపించుకోవడానికి అడ్డాగా మారుతోంది. ఎన్టీఆర్ హయాంలో ఆయన తిరుమలలో ఎన్నో భక్తులకు ఉపయోగకరమైన పథకాలు చేపట్టాడు. కానీ నేడు టిటిడి చైర్మన్ పదవి అంటే అందరికీ ఆశపుట్టింది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో పచ్చినాస్తికుడైన భూమా కరుణాకర్ రెడ్డికి చైర్మన్ పదవి ఇచ్చి దానిని నవ్వులపాలు చేశారు.
ఇక ప్రస్తుత టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదవికాలం ముగియడంతో ఈ పదవి కోసం పాకులాటలు మొదలయ్యాయి. రేసులో ఎంపీ మురళీమోహన్, మరో ఎంపీ రాయపాటి సాంబశివరావు, జ్యోతుల నెహ్రూ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముద్దు కృష్ణమనాయుడు.. ఇలా చాలామంది వచ్చారు. మురళీమోహన్ చంద్రబాబుకు బినామీ అనే పేరుండటంతో ఆయనకు ఈ పదవి ఖాయమని భావించారు.
మరోవైపు తనకు టిటిడి చైర్మన్ పదవి ఇస్తానంటేనే టిడిపిలోకి వచ్చానని, ఆ పదవి ఇవ్వకపోతే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని రాయపాటి బెదిరిస్తున్నారు. ఇక ఏకంగా కొందరు ఢిల్లీలో మకాం వేసి చక్రం తిప్పుతున్నారు. ఇటీవలే టిటిడికి ఈవోగా ఓ ఉత్తరాది వ్యక్తిని మోదీ ప్రభుత్వం పంపించింది. ఇక కల్పవృక్షమైన టిటిడిని తమ చెప్పుచేతల్లోనే ఉంచుకోవాలని కేంద్రం కూడా పావులు కదుపుతోంది. మొత్తానికి వేంకటేశ్వరస్వామి, ఆ కుబేరస్వాముల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో చూద్దాం...!