మోదీ సూచన మేరకు చంద్రబాబు ముందస్తుగా ఎన్నికలకు పోతే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేశాడు. జనసేన బలపడక ముందు, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకముందు, వైసీపీ బలపడకముందే ఎన్నికలకు వెళ్లాలని ఆయన సంబరపడ్డాడు. అయితే అనూహ్యంగా వైసీపీ, జనసేనలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్దమేనని ప్రకటించాయి. దీంతో బాబు పునరాలోచనలో పడ్డాడు.
ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆయన ఇలా ఉత్సాహం చూపించడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. ఆయన మొదటి నుంచి వచ్చే ఎన్నికల్లో నేనే సీఎం.. ఓ 20మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే ప్రభుత్వం పడిపోతుంది.. ప్రభుత్వాన్ని పడగొడతాం.. అంటున్నాడు. అదే సమయంలో జనసేన పుంజుకోవడం ఆయనకు కూడా ఇష్టం లేదు. ప్రస్తుతం తాను బిజెపితో సయోధ్యకు సిద్దమైనా, బిజెపి ఒప్పుకుంటుందో లేదో? కనీసం వామపక్షాలతోనైనా ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు. కానీ సమయం గడిచే కొద్ది వామపక్షాలు జనసేనకు మద్దతు తెలిపే ప్రమాదం ఉండటం దీనికి మరోకారణం.
ఇక ఈ రెండేళ్లు టిడిపినే అధికారంలో ఉంటే ఎలాగైనా కేంద్రాన్ని ఒప్పించి నియోజక వర్గాల పెంపుకు మార్గం చూసుకుంటుందని ఆయన అనుమానిస్తున్నాడు. అసెంబ్లీ స్థానాల పెంపు వల్ల టిడిపికి మేలు.. వైసీపీ కష్టమే. అందుకే ఆయన ఆ రకంగా వ్యూహం పన్నుతున్నాడు. ఇక ఎంపీలు శివప్రసాద్, రాయపాటి, ఎమ్మెల్యేలు బొజ్జల, మోదుగుల వంటి అసంతృప్తిలో ఉన్న నాయకులను ఆయన తన దరికి చేర్చుకోవచ్చని జగన్ భావిస్తున్నాడు.