మొత్తానికి చిరంజీవి తన కుమారుడు చరణ్ బేనర్‌లోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తెలుగు వీరుని కథ 'ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి' జీవిత కథకు ఆగష్టులో శ్రీకారం చుట్టనున్నాడు. ఇక 'బాహుబలి' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి ఓ ముఖ్య కారణం ఉంది. అది కేవలం తెలుగు వారి కథ కాదు. చారిత్రక చిత్రం కాదు. ఓ కాల్పనిక చిత్రం. దాంతో అందరూ దానిని ఓన్ చేసుకున్నారు.
అదే తెలుగు వీరుడైన 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని డబ్ చేసి విడుదల చేసినా కూడా మిగిలిన భాషల వారు చూడరు. కారణం అతను కేవలం తెలుగు వీరుడనే ముద్ర ఉండటమే. మరోపక్క ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కూడా తెలుగు వీరుడే కావడం ఈ చిత్రం టాలీవుడ్‌లో హల్‌చల్ చేసినా మిగిలిన భాషల్లో వారు ఆదరిస్తారని అనుకోలేం. ఇక అదే ఏ భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, చత్రపతి శివాజీ..వంటి వారి చరిత్రలైతేనే అందరూ చూస్తారు.
తెలుగు మన్యం వీరుడైన 'అల్లూరి సీతారామరాజు'ను కూడా మిగిలిన భాషల వారు తమ స్వంత కథగా భావించలేదు. అయినా కూడా మరుగున పడిన ఓ తెలుగు వీరుని చరిత్రను అందించిన బాలకృష్ణ-క్రిష్‌లను, ఇప్పుడు చిరంజీవి-చరణ్‌లను మెచ్చుకోకుండా ఉండలేం. ఇక 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి ఎదురైన ఇబ్బందులే 'ఉయ్యాలవాడ'కు ఎదురుకానున్నాయి. వీరి జీవిత చరిత్రలు పాపులర్ కావు.
మరోవైపు ఆనాటి సాంఘిక ఆచారాలు, వస్త్రదారణలు, వారు వాడిన భాషలు, యాసలపై ఎవ్వరికీ సరిగా సమాచారం లేదు. ఇప్పుడున్న రాయలసీమ భాషకి, వేషధారణకు, పరిస్థితులకు 'ఉయ్యాలవాడ' నాటి భాష, యాస, వేషధారణ, పరిస్థితులకు ఎంతో తేడా ఉండేదని మాత్రం తెలుస్తోంది. కాబట్టి దానిపై చిరు అండ్ టీం దృష్టి పెట్టడం అవసరం...!