అనేక సమీకరణల నడుమ అల్లు రామలింగయ్య జాతీయ అవార్డును దాసరికి అందజేశారు. ఈ అవార్డుకు దాసరి పేరు పరిశీలనే చిత్రంగా జరిగింది. ప్రాంతీయ సమీకరణల నేపథ్యంలో కాపు కులస్తులంతా ఏకమయ్యారు. అదే సామాజిక వర్గానికి చెందిన దాసరి, చిరంజీవి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. మళ్లీ చిరు కుటుంబానికి దాసరి సన్నిహితుడయ్యాడు. దాంతో అల్లు అవార్డును ఈసారి దాసరికి ఇవ్వాలని అల్లు అండ్ కో నిర్ణయించారు. ప్రకటించారు, ఇచ్చేశారు.
సినిమాకు సంబంధించి ఎలాంటి అవార్డు అయినా సరే దాసరి అర్హుడనే విషయం తెలిసిందే. ఆయనకు, అల్లుతో సాన్నిహిత్య సంబంధాలున్నాయి. అల్లు పేరిట అవార్డు నెలకొల్పినపుడు మాత్రం నిర్వాహకులకు దాసరి గుర్తుకురాలేదు. బ్రహ్మానందం మొదలుకొని జానీలీవర్, మనోరమ, రమాప్రభ, కోట శ్రీనివాసరావు, ఈవివి.సత్యనారాయణ, కె.రాఘవేంద్రరావు వంటి వారందరికీ ఇచ్చేశాక దాసరి గుర్తుకురావడం చిత్రంగా ఉంది. పైగా జూనియర్లకు ఇచ్చాక దాసరికి ఇవ్వడం నిర్వాహకులు అనుభవరాహిత్యాన్ని తెలియజేస్తోంది. దాసరికి అల్లు అవార్డు ఇవ్వడమంటే గౌరవించడమా లేక అగౌరపరచడమా అని ఆయన అభిమానులకు డౌట్ వస్తోంది. మరి ఇంత ఆలస్యంగా దాసరిని ఎందుకని ఎంపికచేశారనే దానిపై అల్లు అరవింద్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.