శ్రీనివాస్ అవసరాలకు దర్శకునిగా, నటునిగా క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయన విదేశాలలో ఉద్యోగం చేసినా కూడా తనదైన శైలిలో అందరి మెప్పును పొందుతున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన నవీన్ మేడారం దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ 'హంటర్'కు రీమేక్‌గా 'బాబు బాగా బిజీ' చేశాడు. ఈ చిత్రం ఈరోజు విడుదలకానుంది. కాగా శ్రీని అవసరాల ఇలాంటి చిత్రంలో నటిస్తుండటంపై ఆయనపై విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ ఆయన మాత్రం దానిని సమర్ధించుకున్నాడు. నటునిగా ఎలాంటి అవకాశాలు వచ్చినా చేస్తానని, అన్నిరకాల చిత్రాలలో నటిస్తానని ఆయన చెప్పి ఉంటే అభ్యంతరం ఉండేదికాదు.
కానీ ఆయన శృంగారం అనేది నిజజీవితంలో సహజమేనని, దీనిని తెరపై చూపిస్తే తప్పేముందని వాదించాడు. శృంగారం సృష్టిధర్మం. అందరి జీవితాలలో అది అవసరమే. అది దేవుని సృష్టిరహస్యం. ఆకలి, బాధ, సంతోషాల వలే శృంగారం కూడా సహజమే. కానీ నిజజీవితంలో పిల్లలు ఎలా పుడతారు? రాత్రిళ్లు భార్యాభర్తలు ఏమి చేస్తారు? ఇవ్వన్నీ కూడా సహజమే కాబట్టి వాటిని కూడా తెరపై చూపిస్తే తప్పేముందనే వాదన ఎంత వరకు సమంజసం? విరహాన్ని, శృంగారాన్ని కూడా ఎంత కళాత్మకంగా చూపించవచ్చో కె.విశ్వనాద్ 'ఆపద్బాంధవుడు', 'స్వాతిముత్యం, సాగరసంగమం' వంటి చిత్రాలలో చూపించాడు. హిందీలో రాజ్‌కపూర్ తీసిన చిత్రాలు, కె.రాఘవేంద్రరావు, కృష్ణవంశీలు హీరోయిన్లను ఎంతో అందంగా, శృంగారం అనే భావన లేకుండా, బూతులతో కాకుండా, మొహకవళికల్లో, రెండు పక్షులు, పండ్లు, పూల చెట్లు.. వంటి వాటితో చూపించి మెప్పించలేదా?
ఇక బాలీవుడ్ 'హంటర్'కి లేని అభ్యంతరం తెలుగులో ఎందుకు అంటున్నారు. మరి మలయాళంలో షకీలా చిత్రాలు కూడా ఒకప్పుడు దడదడలాడించి, స్టార్‌హీరోలనే భయపెట్టాయి. కాబట్టి తెలుగులో కూడా అలాంటి చిత్రాలు చేస్తామంటే ఎలా? అవసరాల విదేశాలలో ఉండటం వల్ల ఆయనకు పాశ్చాత్యభావాలు ఉండవచ్చు. అలాగని ఇలా చేయడం సమర్ధనీయం కాదు...!