కేంద్రంతో సఖ్యతగా ఉండవద్దని, అందరితో గొడవలు పెట్టుకోవాలని ఎవ్వరూ చెప్పరు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, వారు తమని నమ్మి గెలిపించినందుకు వారి మనోభావాలకు అనుగుణంగా వెళ్లాలే.. కానీ స్వంత ప్రయోజనాల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద పణంగా పెట్టడం మాత్రం చేతగానితనమే అవుతుంది. ప్రత్యేకహోదా సంజీవని, 5ఏళ్లు కాదు 10, 15ఏళ్లు ఇవ్వాలని చెప్పిన చంద్రబాబే ఆ తర్వాత హోదా కంటే ప్యాకేజీ ఉత్తమని తేల్చిచెప్పాడు. అమెరికా వెళ్తు తాజాగా అరుణ్‌జైట్లీని కలిసి నానా అభ్యర్దనలు చేశాడు. బిజెపితో పొత్తు కోసం, మోదీ హవా కోసం, తమ సొంతపార్టీ వారికి కేంద్రంలో మంత్రిపదవులు, కీలకమైన గవర్నర్ పదవులు వంటి వాటికోసం ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీశాడు.
కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ విషయంలో అటు ఎన్డీఎలో ఉండకుండా, ఇటు యూపీఏకి మద్దతు ఇవ్వకుండా రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తే వారికే తన మద్దతు అంటున్నాడు. దాంతో కీలకమైన టీఆర్‌ఎస్ ఎంపీల మద్దతుకోసం మోదీ సైతం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం.. ఆయన పిలిచిన వెంటనే తెలంగాణ పర్యటనకు రావడం చేస్తున్నాడు. ఇక రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు బిజెపికి కీలకం కానున్నాయి. అది వారికి అగ్నిపరీక్షేనని చెప్పాలి. దాంతో కేంద్రంలోని సర్కార్ అన్నాడీఎంకే, నవీన్‌పట్నాయక్, కేసీఆర్ వంటి వారి వైపు ఆశగా చూస్తోంది. ఇదే అదనుగా భావించిన కేసీఆర్ తన ఎంపీల చేత తాజాగా ఓ ప్రకటన చేయించాడు.
బిజెపి ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థికి తాము ఓటు వేయాలంటే తమ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునివ్వాలని కండీషన్ పెట్టాడు. మరోవైపు సోనియా విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని ఇతర పార్టీలతో పాటు టీఆర్‌ఎస్‌ను కూడా కలుపుకుపోవాలని చూస్తోంది. దీంతో కేసీఆర్ ఏకంగా మోదీకి పెట్టిన షరుత్తు చూస్తే ఆయన చాణక్యం అర్థమవుతోంది. కానీ బాబు మాత్రం ఎన్టీయే బాగస్వామిగా తాము బిజెపి ఎవరిని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తే వారికి బేషరత్తుగా సమర్దిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.