ఎప్పుడైతే 'బాహుబలి'తో ప్రభాస్ నేషనల్ ఐకాన్ అయిపోయాడో.. అప్పటి నుంచి కొందరు కుళ్లుతో రగిలిపోతున్నారు. దాంతో అనవసరంగా ప్రభాస్ కుల ప్రస్దావన తెస్తున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మాట్లాడుతూ, ప్రభాస్‌ని ప్రభాస్ రాజు అని వ్యాఖ్యానించాడు. ఇంతకాలం ప్రభాస్ కులాలకు దూరంగా ఉన్నాడు. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు అని అందరికీ తెలుసు. దాంతో కొందరు ఆయనకు కూడా కులం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే తాజాగా ఈ విషయంలో వర్మ ఎంతో మంచి సలహా ఇచ్చాడు. కాగా ఇప్పుడు మోహన్‌బాబు మాట్లాడుతూ, ఒకప్పుడు దేశాన్ని 'రాజులు' ఏలారని, ప్రస్తుతం ప్రపంచాన్ని 'రాజు' ఏలుతున్నాడని వ్యాఖ్యానించాడు. అంటే ప్రభాస్ విషయంలో కులం గురించి పట్టించుకోని వారికి అన్యాపదేశంగా ఆయన కులం పేరు తేవడం క్షమించకూడని విషయం. ఒక తెలుగు వాడు ఆ స్థాయికి వెళ్లాడంటే గర్వించాలి గానీ కులం రంగు పులమడం ఏమిటి? ప్రభాస్ ఏనాడైనా ప్రభాస్ రాజు అని చెప్పుకున్నాడు.
ఇక 'బాహుబలి' అనేది ప్రభాస్‌కి అవలీలగా రాత్రికి రాత్రి వచ్చిన ఇమేజ్ కాదు. దీని వెనుక 5ఏళ్ల కష్టం, శ్రమ, కృషి, ఇలాంటివెన్నో దాగి ఉన్నాయి. మరో హీరో అయితే ఈ ఐదేళ్లలో 10 చిత్రాలు చేయవచ్చని, తద్వారా 'బాహుబలి' కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ సంపాదించవచ్చని ఆలోచించేవాడు.కానీ ప్రభాస్ కేవలం 'బాహుబలి'ని, రాజమౌళిని నమ్ముకున్నాడు. 25కేజీల వరకు బరువు పెరిగాడు. రోజుకు 40గుడ్లు తినేవాడు. బాడీబిల్డింగ్ కోసం జిమ్‌లు, వర్కౌట్లు, వాలీబాల్ వంటివి ఆడేవాడు.
ఇక ఆయన ఎప్పటికీ వినయశీలి. వివాదరహితులైన కొద్ది మందిలో ఆయన ఒకరు. రాజమౌళి చెప్పినట్లు.. బాహుబలి సమయంలో ప్రభాస్ ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 'మిర్చి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నిర్మాతలు అడ్వాన్స్‌లతో క్యూకడితే కాదనుకున్నాడు. 10కోట్లకు ఓ బ్రాండ్ అంబాసిడర్ అవకాశం వస్తే తృణప్రాయంగా భావించాడు. ఇంట్లో వాళ్లు వేల సంబంధాలు తెస్తే పెళ్లిని తిరస్కరించి, బాహుబలికే అంకితమయ్యాడు. మరి అలాంటి వ్యక్తికి పట్టంగట్టడంలో, పొగడటంలో కులాల ప్రస్తావన ఎందుకు? అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం.