కెరీర్ మొదటి నాళ్లలో ఇండియన్ సూపర్ స్టార్‌కి బాలచందర్‌తో పాటు మరి కొందరు దర్శకులు బాసటగా నిలిచారు. ఇక నిన్నటి తరంలో పి.వాసు, రవికుమార్, సురేష్‌కృష్ణ వంటి దర్శకులు ఆయన్ను అద్భుతంగా తెరపై చూపించారు. 'దళపతి'లో మణిరత్నం కూడా రజిని ఇమేజ్‌ను పీక్‌లో చూపించాడు. 'ముత్తు, బాషా, నరసింహ, చంద్రముఖి..' ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఈ దర్శకుల నుంచి వచ్చాయి. కానీ ప్రస్తుతం రజినిని ఇమేజ్‌కు తగ్గట్లుగా ఆయన్ను చూపే దర్శకులు కనిపించడం లేదు.
వాసు, రవి, సురేష్‌కృష్ణలు వరుసగా నిరుత్సాహ పరిచారు. ఇక ఆయన తన కూతురు సౌందర్యకి 'కొచ్చాడయాన్' చేశాడు. ఇది డిజాస్టర్. మరోవైపు రంజిత్‌పాతో చేసిన 'కబాలి'లో గెటప్ పరంగా చూపించిన వైవిధ్యం సినిమా కథను, రజిని స్టామినాకు తగ్గట్లుగా క్యారెక్టరైజేషన్ చేయడంలో రంజిత్ విఫలమయ్యాడు. ఒక్క శంకర్‌పైనే ప్రస్తుతం ఆయన ఆశలు పెట్టుకున్నాడు. 'రోబో' తర్వాత '2.0'లో కూడా శంకర్ తనని మెప్పిస్తాడని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక కొత్తగా వచ్చిన దర్శకులు ఎవ్వరూ రజినిని టచ్ చేసే పరిస్థితి లేకపోవడంతో మరలా రంజిత్ పాతోనే 'కబాలి' తర్వాత మరో చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత తన అల్లుడు, 'పవర్ పాండి'తో ఫర్వాలేదనిపించిన ధనుష్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఇక గతంలో ఆయన పెద్దగా తెలుగు దర్శకులను పట్టించుకోలేదు. తేజతో ఓ సినిమా చేస్తానన్నాడని వార్తలు వచ్చిన అవి తేలిపోయాయి. ఇప్పటికే రజిని బాగా వయసు మీరిపోయాడు. కాబట్టి వీలున్నంత త్వరగా హీరోలను అద్భుతంగా, హైరేంజ్ హీరోయిజంతో పీక్స్‌కు తీసుకెళ్లే రాజమౌళితో తొందరగా సినిమా చేయడం రజనీకి ముఖ్యం. రాజమౌళి కన్నా ఆ అవసరం రజనీకే ఎక్కువగా ఉంది.