సినిమా వారి వారసులు సినిమాలలో స్టార్స్‌కావడం, వారసత్వ ప్రవేశాలపై ఎప్పటి నుంచో పలు వాదనలు జరుగుతున్నాయి. డాక్టర్ల కొడుకులు డాక్టర్లు, బిజినెస్‌మేన్‌ల వారసులు బిజినెస్ పర్సన్స్.. పొలిటీషియన్స్ వారసులు పొలిటీషియన్స్ అవుతుంటే హీరోల కొడుకులు హీరోలు కావడం తప్పేముందని వాదించేవారు ఉన్నారు. మరి క్రియేటివిటీకి చెందిన రంగాలైన డైరెక్టర్ల కొడుకులు డైరెక్టర్లు అవుతున్నారా? ఒక్క ఫ్లాప్ ఇచ్చినా పక్కన పెట్టడం లేదా? రాఘవేంద్రరావు కొడుకు పరిస్థితి ఏమిటి? ఘంటసాల కొడుకులు ఏమిచేస్తున్నారు? బాలు కొడుకు గాయకునిగా ఎందుకు మెప్పించలేకపోయాడు? సచిన్ కొడుకు సచిన్ అవుతాడనే నమ్మకం ఉందా? గ్యారంటీ ఉందా? లేదనే చెప్పాలి.
ఇక ఈ తుట్టెను మరలా వివాదాల వర్మ కెలికాడు. ధీరుబాయ్ అంబాని తన కొడుకులైన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలకు ఆస్తులు, వ్యాపారాలు ఇవ్వలేదా? మరి అది తప్పు లేనప్పుడు సినిమా నటుల సంతానం నటీనటులైతే తప్పేంటి? వంటి ప్రశ్నలు వేశాడు. నెపోటిజంను వ్యతిరేకించడమంటే కుటుంబ ప్రేమను, దేశప్రేమను వ్యతిరేకించడమేనని, మానవతా విలువలు లేని వారు, మానవత్వం తెలియని వారు మాత్రమే ఈ వాదన చేస్తారని తేల్చిచెప్పాడు. ఇక్కడ ఎవరి సంతానం ఏమైనా కావచ్చు గానీ, స్వయంకృషితో పైకొదిగే వారిని మిగిలిన అందరూ కలిసి గుడుపుఠాణీలు చేసి తొక్కేయడమే సరైన పద్దతి కాదని వర్మ తెలుసుకోవాలి.