పవన్ తాజాగా చేసిన ఓ తప్పు పలు పార్టీలకు ఓ ఆయుధంగా దొరికింది. ప్రత్యేకహోదా ఉద్యమంలో ఆయన పాల్గొనలేదు. వైజాగ్‌కి రాలేదు. మరోపక్క విజయవాడ దగ్గర జరిగిన బస్సు దుర్ఘటన సమయంలో , ఏర్పేడులో జరిగిన ఘోర విపత్తు సమయంలో ఆయన కేవలం ప్రకటనలు, ట్వీట్లపై పరిమితమయ్యాడు. స్వయంగా పరామర్శించలేదు. ఇక ప్రత్యేకహోదా విషయంలో ఆయన ఇచ్చిన పిలుపుకు ఆయన అభిమానులు బాగా స్పందించారు. వారిని పోలీసులు నానా హింసలు పెట్టి, కేసులు కూడా పెట్టారు. దానిపై ఆయన సరిగ్గా, ధీటుగా స్పందించలేకపోయాడు.
ఎంతసేపు చంద్రబాబుగారూ.. నేను ప్రతి విషయాన్ని రాజకీయం చేయను... ఫలానా సమస్యపై స్పందించండి అని వేడుకోలుగా అభ్యర్ధిస్తున్నాడు. రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. కానీ ఆయన ఆరాధించే చెగువేరా నుంచి ఎందరో ధైర్యసాహసాలతో కదనరంగంలోకి దూకిన వారే గానీ, పార్ట్‌టైం పనులు చేయలేదు. నిజమే.. పవన్ ఇంకా పూర్తిగా రాజకీయాలలోకి అడుగుపెట్టలేదు. కానీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకునిగా, ఉద్యమకారునిగా మారాలి. అంతేగానీ ట్వీట్ల పులిలా ఉండటం చాలా మందికి మింగుడు పడని అంశం. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప.. అన్న మహాకవి చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇక తాజాగా ఆయన కేవలం కొద్దిపాటి అగ్నిప్రమాదం జరిగిన ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించాడు. బాబుకు బినామీగా పేరున్న ఆ పత్రికా కార్యాలయాన్ని సందర్శించడంపై ఇప్పుడు వివాదం రేగుతోంది. ఎలాంటి ప్రాణనష్టం జరగని ఆ పత్రికా కార్యాలయానికి స్వయానా వెళ్లి పరామర్శించి, వివరాలు ఆసక్తిగా విని, ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, ప్రమాద వివరాలను ఎంతో అడిగి తెలుసుకుని, మీడియాకు దాసోహం అనేలా వ్యవహరిస్తున్నాడని, ఆయనకు పబ్లిసిటీపై ఈమధ్య బాగా మోజుపెరిగిందనే విమర్శలకు ఆయన అనవసరంగా తావిచ్చాడనే విమర్శలు వస్తున్నాయి.