ఏపీలో పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి వారిని, త్వరలో మరలా కృష్ణంరాజును చేరదీయాలని భావిస్తున్న బిజెపి తెలంగాణలో కూడా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరదీసింది. ప్రస్తుతం బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా మూడు రోజులు తెలంగాణలో పర్యటించి, ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క తెలంగాణలో బిజెపిని పటిష్ట పరిచే బాధ్యతను జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుకు అప్పగించాడు. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత నందీశ్వర్‌గౌడ్‌ను, ఆయన కుమారుడిని బిజెపిలో చేర్చుకున్నారు. ఇక ఇప్పటికే నాగం జనార్ధన్‌రెడ్డి బిజెపిలో ఉన్నాడు. త్వరలో విజయశాంతిని మరలా పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు నిన్నటి వరకు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా అందరూ కాంగ్రెస్‌ను భావించారు. కానీ అమిత్‌షా కదుపుతున్న పావులు చూసి కాంగ్రెస్ నాయకులు బిత్తరపోతున్నారు. తెలంగాణలో టిడిపి మనుగడ కోల్పోయింది. అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఏపీపైనే దృష్టిపెట్టాడు. లోకేష్‌ను కూడా ఏపీకే పరిమితం చేస్తున్నాడు. ఇక టిటిడిపిలో 15మంది ఎమ్మెల్యేలు గెలవగా ఇప్పటికే 12 మంది అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. మిగిలింది ముగ్గురు. దీంతో టిడిపికి ఇక తెలంగాణలో భవిష్యత్తులేదని తేల్చిచెప్పి టిడిపి తురుపుముక్క రేవంత్‌రెడ్డిని, ఆర్.కృష్ణయ్యలకు బిజెపి గాలం వేస్తోంది. స్వయాన మోదీ బిసీ కావడం, ఎలాగైనా బిసి కమిషన్‌కు చట్టబద్దత కల్పించి, తద్వారా దేశంలోని మెజార్టీ బిసీల ఓట్లపై బిజెపి కన్నువేసింది. ఈ సమయంలో ఆర్.కృష్ణయ్యతో పాటు ఎల్.రమణలను కూడా బిజెపిలో చేర్చుకునే వ్యూహాలను బిజెపి రచిస్తోంది.