తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశవ్యాప్తంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసే సర్వేలలో అధికశాతం నిజమయ్యాయి. దాంతో ఆయన సర్వేలకు అందరూ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇటీవల లగడపాటి ఏపీలో ఓ సర్వే నిర్వహించిన మాట కూడా వాస్తవమేనంటున్నారు. కాగా ఇటీవల లగడపాటి.. సీఎం చంద్రబాబును కలవడంతో అందరూ ఆయన టిడిపిలో చేరుతాడని, కేశినేని నాని బదులు ఈసారి సీటును లగడపాటికి చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉందని పుకార్లు షికారు చేశాయి.
కాగా రాష్ట్రం విడిపోతే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని చెప్పిన లగడపాటి ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాడు. ఆయన చంద్రబాబును కలిసింది ల్యాంకో పవర్ ప్రాజెక్ట్ గురించి అని తేలింది. పనిలో పనిగా ఆయన చంద్రబాబుకు తాను చేసిన సర్వే వివరాలను తెలియజేశాడట. చంద్రబాబు పనితీరు, ఆయన సామర్ధ్యంపై నమ్మకం ఉన్నప్పటికీ ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం, అవినీతి హద్దులు మీరుతుండటం, స్థానికంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న టిడిపివారిలో అత్యధికుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని లగడపాటి తేల్చారు.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 70శాతం మంది ఓడిపోవడం ఖాయమని,కాబట్టి అభ్యర్ధులను మార్చుకోవాల్సిందిగా సలహా ఇవ్వడంతో పాటు రాష్ట్రంలోని నియోజక వర్గాల పునర్విభన చేయించుకుని, సీట్లను పెంచుకుంటే బాబుకు బాగా కలిసొస్తుందని, ప్రస్తుతం ఎన్నికలు వస్తే మాత్రం వైసీపీ గెలవడం ఖాయమని లగడపాటి తేల్చిచెప్పాడని సమాచారం. వాస్తవ పరిస్థితులను తీసుకున్నా ఎవరికి కదిలించినా అందరూ లగడపాటిలాగానే వ్యాఖ్యలు చేస్తున్నారు...!