ముఖ్యమంత్రుల నుంచి చోటా నాయకుల వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కలెక్టర్ల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు దేశం మొత్తం.. బాహుబలి జపం చేస్తోంది. దాదాపు గత వారం రోజులుగా ఈ చిత్రం దేశంలో మేనియా అయిపోయింది. ఉత్సవాలకు, పుష్కరాలకు, జాతర్లకు మించిన జనసందోహాలు ధియేటర్ల వద్ద బారులు తీరుతున్నాయి. ప్రతిథియేటర్‌లో ఉదయం 7గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు దాదాపు అన్ని థియేటర్లలో , అన్ని రాష్ట్రాలలో ఈ చిత్రం ఊపు ఊపుతోంది.
టిక్కెట్ల రేటు ప్రజలే కాదు.. ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు కూడా పట్టించుకోవడంలేదు. కొందరైతే కేవలం 120 రూపాయలకే ఇంత గొప్ప చిత్రం చూడటం సాధ్యమేనా? థియేటర్ల బయట కలెక్షన్ బాక్సులుపెట్టాలి. లేదా నిర్మాతల బ్యాంకు అకౌంట్ల నెంబర్లను, అడ్రస్‌లను ఇవ్వాలి.. ఈ చిత్రాన్ని ఎంత రేటు పెట్టి చూసినా తప్పులేదు. నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు అభినందనీయులు.. కేవలం ఈ చిత్రం రెండు భాగాలతో ముగిసిపోవడానికి వీలు లేదు.
ఈ సిరీస్‌ను కొనసాగిస్తూనే ఉండాలి. ఇక మూడు గంటలే ఈ చిత్రం ఉండటం నిరుత్సాహం కలిగిస్తోంది అంటున్నారు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పొగడ్తలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ చిత్రం 1000కోట్లు కాదు.. 1500కోట్లు గ్యారంటీ అంటున్నారు. ప్రస్తుతం వచ్చిన ఈ చిత్రం కలెక్షన్లను మరో ఐదారేళ్లు ఏ చిత్రం దాటలేదని, ఇంకా టిక్కెట్ల రేట్లు పెరిగి, ప్రేక్షకుల సంఖ్య, జనాభా సంఖ్య పెరిగితే గానీ ఈ చిత్రం కలెక్షన్లను వేరే చిత్రం అందుకోలేదంటున్నారు. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ 40మంది సినీ అభిమానులు చాటర్డ్ ఫ్టైట్‌లో కోల్‌కత్తా వచ్చి సినిమా చూసి వెళ్లారు.
ఇక ఏపీ కేబినెట్ అయితే బాహుబలి టీంను పొగడ్తలతో ముంచెత్తుతూ తీర్మానం చేసింది, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మనవడితో సహా మొత్తం 48 టిక్కెట్లను బుక్ చేయించుకుని ఈ చిత్రం చూశారు. మల్టీప్లెక్స్‌లలో కూడా 200రూపాయల కంటే ఎక్కువ రేటుకు టిక్కెట్లను అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసిన ఆయనే స్వయంగా బెంగుళూరులోని పివీఆర్ మాల్‌లో ఒక్కో టిక్కెట్‌ను 1000 రూపాయలకు పైగా కొనుగోలు చేసి కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. వర్మ చెప్పినట్లు దేశంలో అందరూ కుళ్లుతో ఐసియూలో చేరే ప్రమాదాలు కనిపిస్తున్నాయి.